స‌ర్‌ను స‌మ‌ర్థించిన సుప్రీం కోర్టు

Supreme Court upholds SIR:ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స‌ర్‌ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎన్నికల సంఘం (EC) అధికారాలను సమర్థించింది. బుధవారం వెలువడిన తీర్పులో ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధం కాదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియ ఏ చట్టాన్నీ, రాజ్యాంగ నిబంధనలనూ ఉల్లంఘించలేదని పేర్కొంది.

సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు
పౌరసత్వ నిర్ధారణపై స్పష్టత: ఓటరు జాబితాలో ఒక వ్యక్తికి ఉండాల్సిన అర్హతను (Eligibility) పరిశీలించే అధికారం మాత్రమే ఈసీకి ఉంటుందని, అంతేకానీ వారి పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం ఈసీకి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన వారి పౌరసత్వం రద్దయినట్లు కాదని తేల్చి చెప్పింది.

ఆర్టికల్ 324 పరిధి: రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, స్వేచ్ఛాయుతపారదర్శక ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఈసీపై ఉంటుంది. ఈ క్రమంలో ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు సాధారణ సవరణల కంటే భిన్నమైన SIR లాంటి పద్ధతులను ఎంచుకోవడం చట్టవిరుద్ధం కాదని కోర్టు పేర్కొంది.

ఆధార్ అనుమతించడం: ఓటరుగా నిరూపించుకోవడానికి ఈసీ గతంలో సూచించిన 11 రకాల పత్రాలు అంతిమం కాదని, వాటికి అదనంగా ఆధార్ (Aadhaar) కార్డును కూడా ఒక ప్రామాణిక పత్రంగా పరిగణించవచ్చని తెలిపింది.

న్యాయ సమీక్షకు అవకాశం: ఎవరైనా అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా తొలగించబడితే, వారు తగిన న్యాయస్థానాలను ఆశ్రయించడానికి (Judicial Review) పూర్తి అవకాశాలు ఉంటాయని కోర్టు భరోసా ఇచ్చింది.

SIR ఎందుకు వివాదమైంది?
సాధారణంగా ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంది. అయితే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కింద బీహార్‌లో (ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో) పాత ఓటర్ల జాబితాల్లో (ఉదాహరణకు 2002/2003) పేర్లు ఉండి, ప్రస్తుతం అడ్రస్ లేని లేదా ట్రేస్ చేయలేని ఓటర్ల వివరాలను ఈసీ సమగ్రంగా విచారించడం మొదలుపెట్టింది. పాత ఓటర్ల జాబితా ఆధారంగా తమ గుర్తింపు  మళ్లీ నిరూపించుకోవాలని ఈసీ కోరడాన్ని పలు రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఇది ఒకరకంగా పౌరసత్వాన్ని ప్రశ్నించడమే అవుతుందని పిటిషనర్లు వాదించారు. కానీ, నకిలీ, మరణించిన లేదా వలస వెళ్లిన వారి ఓట్లను ఏరివేసి “స్వచ్ఛమైన ఓటర్ల జాబితా”ను తయారు చేయడానికే ఈ ప్రక్రియ అని, దీనికి రాజ్యాంగబద్ధత ఉందని సుప్రీంకోర్టు సమర్థించింది. దీనితో  ఏడాదిగా ఈ SIR ప్రక్రియ చుట్టూ అలుముకున్న వివాదాలకు శాశ్వతంగా తెరపడింది.

You might also like