ఆ టీచర్లు ఐదుగురిపైనా వేటు..
మంచిర్యాల – అంగన్‌వాడీలో సరుకులు పక్కదారి పట్టిన వ్యవహారంలో ఆ ఐదుగురు టీచర్లపైనా వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమచారం. ఇందులో ఇప్పటికే ముగ్గురు సూపర్‌వైజర్లను సస్పెండ్ చేయగా, సీడీపీవో నక్క మనోరమకు మెమో జారీ చేశారు. ఈ విషయంలో అసలు పాత్రధారులైన టీచర్లపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇంతకీ ఏం జరిగిందంటే…
మంచిర్యాల జిల్లాలో కొద్ది రోజులుగా అంగన్‌వాడీ సరుకులు పక్కదారి పడుతున్నాయి. చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఇవ్వాల్సిన పాలు, కోడిగుడ్లు, ఇతర సరుకులు అమ్ముకుంటున్నారు. కోడిగుడ్లు మంచిర్యాలలోని రెస్టారెంట్ కు తరలిస్తుండగా, పాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న స్వీట్ హౌజ్‌లకు, సరుకులు కిరాణాషాపులకు అమ్మేస్తున్నారు. కొద్ది రోజుల కిందట సీసీసీ నస్పూరులో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా, ట్రాలీలో అంగన్‌వాడీకి సంబంధించిన కోడిగుడ్లు, పాలపాకెట్లు గుర్తించారు. గర్భిణులు, పిల్లలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలను కొందరు అంగన్‌వాడీ టీచర్లు బయట అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది.
చర్యలకు రంగం సిద్దం..
అంతా రచ్చరచ్చ కావడంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం వచ్చి తనిఖీలు నిర్వహించింది. ఫుడ్ స్టాక్ అన్నింటిని సోదాలు చేసి రికార్డులను పరిశీలించారు. ఆ బృందం తన నివేదికను కమిషరేట్ కార్యాలయంలో సమర్పించారు. ఆ నివేదిక మళ్లీ మంచిర్యాల కలెక్టరేట్‌కు పంపించారు. ప్రస్తుతం మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీకేరీ వద్ద ఆ ఫైల్ ఉంది. అంతా చూసిన ఆమె టీచర్లపై వేటు వేసేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రత్యామ్నాయ పంటలు తదితర వ్యవహరాల్లో కలెక్టర్ బిజీగా ఉండటంతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఆపేందుకు నేతలు సిద్దం..
అయితే ఐదుగురు టీచర్లపై చర్యలు తీసుకోకుండా నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసలు దోషి అయిన సీడీపీవోకు కేవలం మెమో ఇచ్చేలా చేయగలిగారు. ఇక టీచర్లపై కూడా ఈగ వాలకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ ద్వారా కలెక్టర్‌కు చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా నేరుగా కలెక్టర్‌ను కలిసి టీచర్ల తప్పిదం ఏమీ లేదని వెళ్లి కలిసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ లేకపోవడంతో ఏవోకు వినతిపత్రం ఇచ్చి వచ్చారు. అటు చర్యలు తీసుకునేందుకు అధికారులు, ఇటు ఆపేందుకు అంగన్‌వాడీ యూనియన్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.