తెలంగాణ మీ అయ్య జాగీరా..?

-తెలంగాణ నుంచి పోరాట స్ఫూర్తిని పొందాను
-చెరువు కబ్జా చేసినట్లు తేలితే.. తిరిగి రాసిస్తా
-తెలంగాణ ప్రజలకు ఆంధ్రాపై విద్వేషం లేదు
-రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు లేవ‌ని గొంతులు ఇప్పుడు లేస్తున్న‌య్‌
-కాంగ్రెస్ నేతలు ఐ లవ్ పాకిస్థాన్ అంటే తప్పులేదు.. నేను ప్రెస్ మీట్ పెడితే తప్పా..?
-విలేక‌రుల స‌మావేశంలో దుమ్మెత్తిపోసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఇక్క‌డ న‌న్ను తిర‌గ‌వ‌ద్ద‌ని అన‌డానికి మీరెవ‌రు..? తెలంగాణ మీ అయ్య జాగీరా..? అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్(Pawan Kalyan) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై తనకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమన్నారు. జనసేన తెలంగాణలోనే పుట్టిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో తన ప్రవేశాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తీవ్రంగా స్పందించిన పవన్, తెలంగాణ ఎవరి జాగీరు కాదన్నారు.

‘‘తెలంగాణపై నాకున్న ప్రేమ.. రాజకీయాలకు అతీతం.. తెలంగాణలో లక్ష మందికి పైగా జనసేన నాయకులు, సైనికులు ఉన్నారు.. జనసేన తెలంగాణలో ఎందుకని కొందరు అంటున్నారు.. తెలంగాణ నడిబొడ్డున జనసేన పుట్టింది’’ అన్నారు. ఇది కొత్తగా తెచ్చుకున్న.. విభజనతో వచ్చిన ప్రేమకాదని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి పోరాట స్ఫూర్తిని పొందానని.. తన సినిమాల్లో తెలంగాణ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. తెలంగాణ నలుమూలలా తిరిగినవాడినని.. కానీ.. ఇప్పుడు వద్దంటున్న వారు తిరిగారా ..? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రావొద్దంటూ వీళ్లెవరు అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణ కంటే ఏపీలోనే బెదిరింపులు ఎక్కువ.. బాంచన్‌ అనే వాళ్లం అయితే పార్టీ పెడతామా.. భయపడేవాళ్లం అయితే పార్టీ పెడతామా అంటూ పవన్‌ వివరించారు. KCR ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరినైనా ఒక్క మాట అన్నానా..? తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని.. ఎన్ని తిట్టినా పట్టించుకోనని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) అంటే తనకు ఇష్టమని.. తాను చెరువు భూమిని కబ్జా చేసినట్లు తేలితే.. తానే తిరిగి రాసిస్తాననని పేర్కొన్నారు. తెలంగాణలో ఉపాధి లేకపోతే తాను కారణమా అని ప్రశ్నించారు. మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చింది.. ఆంధ్రా వాళ్లను తిడుతుంటే.. వాళ్లు ఇక్కడెలా ఉంటారని ప్రశ్నించారు.

“ఎప్పుడూ తెలంగాణ బాగుండాలి అనుకుంటాను. ఆదిలాబాద్ జిల్లాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తిరిగాం. గోండు గూడేల్లో తిరిగాం. తెలంగాణపై ప్రేమతో ఇదంతా చేశామ‌న్నారు. ఏపీలో వారాహిని తిరగనివ్వకపోతే, తెలంగాణలో అనుమతిచ్చారని వెల్ల‌డించారు. ఏపీలో అడుగుపెట్టనివ్వకపోతే, తెలంగాణ నుంచి చాలా మంది అండగా వచ్చారని  స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రాపై విధ్వేషం లేదు.  ఆంధ్రపై ఎంతో ప్రేమ ఉందని తెలిపారు.

నాకు కమిట్ మెంట్ లేకపోతే కొండగట్టుకు టీటీడీ నుంచి నిధులు ఎందుకిస్తాం? ఈ రోజు బెదిరించే వాళ్లకు ఒకటే చెబుతున్నా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు.. ఆ రోజు మీరు గొంతు తెరిచారా? యువరాజ్యం పెట్టాక.. మొదటి సారి నాపై కేసు పెట్టింది. తెలంగాణలో భీమ్ రావు ఏరియా కోసం. దాడులు నాకు కొత్త కాదు. మీరు చేసే తాటాకు చప్పుళ్లు భయపడను” అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు నేను స్వాగతించాను. అలా అందరూ పంజాబ్, మహారాష్ట్ర వెళ్లొచ్చు. మరి మేం ఇక్కడికి రాకూడదా? మరి మేమంటే భయం ఎందుకు? మేము ప్రజల్ని చైతన్యం చేస్తామని భయమంటూ ఎద్దేవా చేశారు.

నేను ఇక్క‌డ‌కు రాకూడదంటే.. అసెంబ్లీలో తీర్మానం పెట్టండి.. ఎలా పెడతారో నేనూ చూస్తానంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా. ప్రతీ సమస్య, ప్రతీ అన్యాయంపై మాట్లాడతాం. ఎదుర్కొంటాం. తెలంగాణ.. భారత దేశంలో అంతర్భాగం. మర్చిపోకండి. తెలంగాణ నా దేశంలో అంతర్భాగం” అని పవన్ కళ్యాణ్ అన్నారు. “కాంగ్రెస్ నేతలు ఐ లవ్ పాకిస్థాన్ అంటే తప్పులేదు.. నేను ప్రెస్ మీట్ పెడితే తప్పా? రాజశేఖర రెడ్డి(Y. S. Rajasekhara Reddy) బతికివున్నప్పుడు లేవని గొంతులు ఇప్పుడు లేస్తున్నాయని దుయ్య‌బ‌ట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like