మంచిర్యాల పర్యటనకు భట్టి..

-రెండు రోజుల పాటు ఇక్క‌డే..
-సింగరేణిలో నియామక పత్రాల పంపిణీ
-గూడెం గుడి అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపన

Deputy Chief Minister Bhatti Vikramarka: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంచిర్యాల రానున్నారు. ఆయ‌న సింగ‌రేణి ప్రాంతంలో ప‌ర్య‌ట‌న‌తో పాటు గూడెం దేవాల‌యానికి సంబంధించిన అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు.

ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) రెండు రోజులు మంచిర్యాల జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న ఈ నెల 13న శ్రీ‌రాంపూర్ ఏరియాలో సింగ‌రేణి ప్రాంతంలో ప‌ర్య‌టిస్తారు. గ‌నుల మీద ప‌ర్య‌టించనున్న ఆయ‌న సింగ‌రేణిలో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొంది వీటీసీ పూర్తి చేసుకున్న దాదాపు 400 మందికి నియామ‌క‌ప‌త్రాలు అందిస్తారు.

దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయ(Gudem Satyanarayana Swamy Temple) అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. గూడెం దేవాల‌యాన్ని గోదావరి పుష్కరాలు, పర్యాటక అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కేంద్రంగా ఎంపిక చేసింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) ప్రతిపాదనల మేరకు, ఆలయాన్ని విశిష్ట పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. బాసర నుండి భద్రాచలం వరకు చేపట్టే అభివృద్ధి పనుల్లో మొదటి ప్రాధాన్యత కింద ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఘాట్ రోడ్డు, స్నానఘట్టాలు, తాగునీరు, వసతి గృహాలు, క్యూలైన్లు వంటి సౌకర్యాలను విస్తరించనున్నారు. కొండపై వెలసిన ఈ ఆలయాన్ని యాత్రికులు సులువుగా చేరుకునేందుకు రోడ్డు రవాణా, గిరిజన ప్రాంత అభివృద్ధి, సుందరీకరణ పనులను దశలవారీగా చేపట్టనున్నారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) సైతం గూడెం దేవాల‌యం అభివృద్ధికి సంబంధించి ప్ర‌క‌ట‌న చేశారు. దేవాల‌య అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు ఎంత‌గానో కృషి చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఆల‌య అభివృద్ధి ప‌నులు ప్రారంభించ‌నున్నారు. దేవాల‌య అభివృద్ధి ప‌నులు ప్రారంభం అవుతుండ‌టంతో భ‌క్తులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like