మీనాక్షి నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌… తెలంగాణ‌లో ఆ కేసే కార‌ణం..

Meenakshi Natarajan: ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెన‌క తెలంగాణ‌కు చెందిన ఓ కేసు ఉండ‌టం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. నారాయణపేట జిల్లాకు చెందిన ఓ లైంగిక వేధింపుల కేసే దీనికి కారణమ‌ని తెలియ‌డంతో అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత‌కీ ఆ కేసేంటి..? ఎప్పుడు న‌మోద‌య్యింది…? దానికి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు సంబంధం ఏంట‌ని ప‌లువురు ఆరా తీస్తున్నారు. ఇంత‌కీ ఆ కేసు ఏంటంటే..

నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిపై లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణల కేసు న‌మోదు అయ్యింది. దీనిపై మాజీ కార్పొరేట‌ర్ శ్రీ‌ల‌త కోర్టులో పిటిష‌న్ వేశారు. శివకుమార్ రెడ్డిపై ఇప్పటికే పలు పోలీస్ కేసులు నమోద‌య్యాయ‌ని, పార్టీ ఆయనపై సరైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో పాటు, పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయంపై మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సహా పలువురు నేతల పాత్రను ఆమె పిటిషన్‌లో ప్రస్తావించారు.

ఈ పిటిషన్‌ పరిశీలించిన హైదరాబాద్ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, మీనాక్షీ నటరాజన్ సహా పలువురు నేతలకు సమన్లు జారీ చేసింది. హైదరాబాద్‌లోని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (ACJM) ఆమెకు BNSS సెక్షన్ 223 కింద నోటీసు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ 2025 అక్టోబర్‌లో ఒక సమాధానం దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్ సమర్పించే సమయంలో అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్/సివిల్ కేసుల పూర్తి వివరాలను అఫిడవిట్‌లో పొందుపరచడం తప్పనిసరి. అయితే, ఆమె ఈ తెలంగాణ కేసు వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

దీంతో దీనిపై విచారణ జరిపిన అధికారులు ఈ ఆరోపణలను నిజమని నిర్ధారించి, సరైన సమాచారం ఇవ్వలేదన్న కారణంతో మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రద్దు చేశారు. మీనాక్షి న‌ట‌రాజ‌న్ నామినేష‌న్ తిర‌స్క‌రంచిన రిట‌ర్నింగ్ అధికారి ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. కేసు విష‌యం ఆమెకు తెలియ‌కుండా జ‌ర‌గ‌లేద‌ని, ఆమెకు స‌మ‌న్లు రావ‌డం, ఆమె స‌మాధానం చెప్ప‌డం మొత్తం విషయంపై పూర్తి అవగాహన ఉందని స్పష్టంగా రుజువు చేస్తుందని రిటర్నింగ్ ఆఫీసర్ (RO) పేర్కొన్నారు. ఆ విష‌యాన్ని దాచిపెట్టి అఫిడవిట్ ఫారం 26 అసంపూర్తిగా దాఖలు చేశారని ఆర్వో చెప్ప‌డం గ‌మ‌నార్హం.

 

You might also like