ఉపాధి కూలీలకు తప్పిన పెను ప్రమాదం
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సలో ఉపాధి హామీ కూలీలు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఉపాధి హామీ పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తుండగా, వాహనంలోకి ఒక్కసారిగా పాము రావడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో రన్నింగ్‌లో ఉన్న ఆటో నుంచి పలువురు కూలీలు కిందకు దూకడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రేవెల్లి శ్రీనివాస్(51), కోనగిరి తిరుపతి(54), కోనగిరి మల్లన్న(42)కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.