సింగ‌రేణి మ‌రో మైలు రాయి..

- పర్యావరణ ప్రమాణాల అమలుకు సింగరేణికి కేంద్రం ప్రశంస
-వడ్డీతో సహా రూ.40 కోట్ల డిపాజిట్ తిరిగి చెల్లించిన కేంద్ర సంస్థ
-డోర్లీ-2 గని మూసివేతలో ఆదర్శంగా నిలిచిన సింగరేణి
-త్వరలో డోర్లీ-1 గనికి సంబంధించి మరో రూ.60 కోట్లకు పైగా వచ్చే అవకాశం
-సింగరేణికి తిరిగి రూ.40 కోట్ల ఎస్క్రో డిపాజిట్

Singareni:బొగ్గు గనుల నిర్వహణతో పాటు గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-2 ఓపెన్‌కాస్ట్ గనిని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేయడంతో, గని ప్రారంభ సమయంలో ఎస్క్రో డిపాజిట్‌గా జమ చేసిన సుమారు రూ.40 కోట్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించేందుకు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (CCO) ఆమోదం తెలిపింది.

ఎస్క్రో డిపాజిట్ అంటే ఏమిటి?

కొత్త గని ప్రారంభానికి అనుమతులు పొందే సమయంలో గని జీవితకాలంలో చేపట్టాల్సిన పర్యావరణ పరిరక్షణ, భూసంరక్షణ, పునరుద్ధరణ, గని మూసివేత తదితర చర్యల కోసం అయ్యే వ్యయాన్ని అంచనా వేసి, ఆ మొత్తాన్ని కంపెనీ నుంచి ముందస్తుగా ఎస్క్రో డిపాజిట్‌గా తీసుకుంటారు. గని మూసివేత అనంతరం  నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేసినట్లు నిర్ధారణ అయిన తర్వాత ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు.

డోర్లీ-2 గనికి రూ.26.79 కోట్ల డిపాజిట్

డోర్లీ ఓపెన్‌కాస్ట్-2 గనికి 2013-14లో అనుమతులు లభించాయి. గని నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చర్యల కోసం అంచనా వ్యయం రూ.26.79 కోట్లను సింగరేణి సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పేరుతో డిపాజిట్ చేసింది. ఏడు సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి చేసిన అనంతరం 2023-24లో గనిని మూసివేసింది. గని మూసివేతకు సంబంధించిన చర్యలపై 2024 జూలైలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ప్రత్యేక ఆడిట్ నిర్వహించగా, అన్ని నిబంధనలను సింగరేణి సమర్థంగా అమలు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.

వడ్డీతో కలిపి రూ.40 కోట్లు

ఆడిట్ నివేదిక ఆధారంగా డిప్యూటీ అసిస్టెంట్ కోల్ కంట్రోలర్ ఆకాష్ శివ హరే సింగరేణికి లేఖ రాశారు. మొత్తం చెల్లించాల్సిన మొత్తంలో 90 శాతం అయిన రూ.36.63 కోట్లను ప్రస్తుతం విడుదల చేస్తున్నట్లు, మిగిలిన 10 శాతం ‘జస్ట్ ట్రాన్సిషన్ ప్రొవిజన్స్’ అంశాల పరిశీలన అనంతరం చెల్లిస్తామని పేర్కొన్నారు. దీంతో వడ్డీతో కలిపి దాదాపు రూ.40 కోట్లు సింగరేణి ఖాతాలోకి రానున్నాయి.

 సింగరేణి అమలు చేసిన కీలక చర్యలు

గని ప్రాంతంలో గతంలో ఉన్న అడవికి సమానంగా 162.517 హెక్టార్లలో దట్టమైన అటవీ పెంపకం.

19.76 లక్షల క్యూబిక్ మీటర్ల టాప్‌సాయిల్‌ను భద్రపరచి తిరిగి వినియోగించడం.

ధూళి కాలుష్య నియంత్రణ కోసం డస్ట్ కలెక్టర్లు, వాటర్ స్ప్రింక్లర్లు, మిస్ట్ స్ప్రేయర్ల ఏర్పాటు.

హాల్ రోడ్ల వెంట గ్రీన్ బెల్టుల అభివృద్ధి.

10 కిలోమీటర్ల గార్ల్యాండ్ డ్రైనేజీలు, చెక్‌డ్యామ్‌లు, సెటిలింగ్ ట్యాంకుల ద్వారా జల కాలుష్య నియంత్రణ.

గని మూసివేత అనంతరం భద్రతా ఏర్పాట్లు, కంచె నిర్మాణం, పాత నిర్మాణాల సురక్షిత తొలగింపు.

మరో రూ.60 కోట్లకు అవకాశం

సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సంస్థ చేపడుతున్న శాస్త్రీయ గని మూసివేత చర్యలకు ఇది నిదర్శనమని తెలిపారు. గతంలో శ్రీరాంపూర్‌లోని ఆర్కే-8 ఇంక్లైన్ భూగర్భ గనికి సంబంధించిన రూ.4 కోట్ల డిపాజిట్ కూడా ఇదే విధంగా తిరిగి లభించిందన్నారు. ప్రస్తుతం డోర్లీ-1 గనికి సంబంధించిన తనిఖీలు చివరి దశలో ఉండటంతో, మరో రూ.60 కోట్లకు పైగా డిపాజిట్లు తిరిగి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like