రైతును రాజు చేసేదాకా పోరాటం
-రైతుల వద్ద రూ.1,200 కోట్లు దోచుకున్నారు
-రేవంత్ సర్కార్ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం
-వ్యవసాయానికి పరిశ్రమ హోదా ఇవ్వాలి
-వ్యవసాయాన్ని కాపాడితేనే గ్రామీణాభివృద్ధి
-రైతుల కోసం ఉమ్మడి పోరాటానికి పిలుపు
-రైతు భరోసా బకాయిలు వెంటనే చెల్లించాలి
-నల్గొండ బత్తాయి రైతులకు అండగా ఉంటాం
-రైతు సమస్యలపై తెలంగాణ రక్షణ సేన కార్యాచరణ
-రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
TRS leader Kalvakuntla Kavitha:రైతును రాజు చేసేదాకా తమ పోరాటం ఆగదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత(TRS leader Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని కాపాడితేనే గ్రామీణాభివృద్ధి అన్నారు. నల్గొండలో హోటల్ తెలంగాణ రైతు సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించి పారిశ్రామికవేత్తలకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను రైతులకు కూడా అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలకు ఉక్కు సంకల్పం ఉంటే వ్యవసాయ రంగంలో అద్భుతాలు సాధ్యమవుతాయని పేర్కొన్న కవిత, ప్రస్తుతం రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తరుగు, రవాణా, ప్యాకింగ్ పేర్లతో రైతులపై భారీ భారం మోపి రూ.1,200 కోట్ల మేర నష్టం కలిగించిందని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలని, రైతు సంఘాలు పార్టీలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. రైతులు పండించే పంటలకు బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే అధిక ఆదాయం సాధ్యమవుతుందని చెప్పారు. నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా బకాయిలను వెంటనే చెల్లించాలని, కౌలు రైతులను గుర్తించి వారికి కూడా రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ప్రకటించిన రూ.12 వేల సాయం ఇవ్వాలని కోరారు. యూరియా కొరత, పంట మార్పిడి, సాగునీటి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
రౌండ్ టేబుల్ సమావేశం – 10 ముఖ్య తీర్మానాలు…
రైతు డిస్కం వద్దు.
యూరియా యాప్ తీసేయాలి.
బకాయి పడ్డ ‘రైతు భరోసా’ తక్షణమే విడుదల చేయాలి.
36 శాతం ఉన్న కౌలు రైతులను గుర్తించి వారికి రైతు భరోసా ఇవ్వాలి.
రైతు కూలీలకు ఇస్తామన్న రూ. 12,000 ఇవ్వాలి.
నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
మూసీ కాలుష్యాన్ని నివారించాలి.
నిమ్మ, బత్తాయి రైతులకు మార్కెటింగ్ పరంగా అండగా ఉండాలి.
పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవాలి.
రైతు సమస్యలపై ఉమ్మడి కార్యాచరణతో భవిష్యత్ ఉద్యమాలు చేపట్టాలి.
నిరుద్యోగులు & ఉద్యమకారుల కోసం డిమాండ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభించాలని, కానిస్టేబుల్ పోస్టులను 5 వేల నుంచి 20 వేలకు పెంచాలని కవిత డిమాండ్ చేశారు. ఎస్సై ఉద్యోగానికి ఇచ్చినట్లే కానిస్టేబుల్ జాబ్‌కు కూడా 35 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలన్నారు. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం జులై 2న ఉప్పల్ భగాయత్ లో ప్రభుత్వ భూమిని ఆక్రమించబోతున్నామని, ఈ పోరాటానికి నల్గొండ జిల్లా నుంచి ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు.