మట్టి కుప్పలనే బొగ్గు అంటున్నారు..
-సింగరేణిని నామరూపాలు లేకుండా చేసేందుకు కుట్రలు
-కాంగ్రెస్ పాలనలో వరుస కుంభకోణాలు
-40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వల లెక్కలు ఫేక్
-సీబీఐ విచారణ జరిపించాలి : మాజీ మంత్రి కొప్పుల
Singareni:సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడానికే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Former Minister Koppula Eshwar) ఆరోపించారు. శుక్రవారం రామగుండం ఆర్‌జీ-1, ఓసీపీ-5లోని బొగ్గు నిల్వలను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్(Former MLA Putta Madhukar), టీజీబీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి(TGBKS President Miryala Raji Reddy)తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడారు. సింగరేణి సంస్థలో వరుస కుంభకోణాలతో సంస్థనే ప్రశ్నార్థకం చేసేలా దోపిడీ జరుగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీ కాంట్రాక్టులు, సోలార్ పవర్ ప్లాంట్లు, డెటోనేటర్ కాంట్రాక్టులు, పవర్ ప్రాజెక్టుల వ్యవహారాల్లో అవినీతి, అక్రమాలకు తెరలేపిందని ఆరోపించారు.
‘బొగ్గు పేరుతో మట్టి, బండలు చూపిస్తున్నారు’
ఒకప్పుడు లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన సింగరేణి సంస్థను నేడు సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం సింగరేణి వ్యాప్తంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందన్నారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పేర్కొన్నారు. ఆర్‌జీ-1, ఓసీపీ-5లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, ప్రస్తుతం 3.60 లక్షల టన్నులు మిగిలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారని, కానీ ప్రత్యక్షంగా పరిశీలిస్తే అక్కడ మట్టి, బండలు, పనికిరాని వ్యర్థాలను కుప్పలు చేసి బొగ్గుగా చూపిస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. అక్కడ 50 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు కూడా కనిపించడం లేదని అన్నారు.
కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది
సింగరేణి సంస్థను సర్వనాశనం చేయడంతో పాటు కార్మికుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోనే అనేక అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిల్వలు చూపిస్తున్న ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. బొగ్గు నిల్వల లెక్కలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. లేని బొగ్గును ఎలా లెక్కల్లో చూపిస్తున్నారో ప్రజలకు వెల్లడించాలని అన్నారు. ప్రజాధనాన్ని వృథా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో అన్యాయం..
ఇటీవల గోదావరిఖనిలో మాజీ మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో డిపెండెంట్ ఉద్యోగాల అంశాన్ని ప్రస్తావించారని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దాదాపు 400 మంది కార్మికులకు ఉద్యోగ నియామకాల విషయంలో అన్యాయం జరుగుతోందని వెల్లడించారని, ఈ విషయం బయటకు రావడంతో అధికారులు రెండు రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. సింగరేణిలో జరుగుతున్న వరుస కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.