ప్రేంసాగర్ రావు మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు…
-దశాబ్దాల తర్వాత మంచిర్యాలకు దొరికిన నిజమైన విజనరీ లీడర్
-రాష్ట్రవ్యాప్తంగా 'మంచిర్యాల మోడల్' అమలు చేస్తాం
-మంచిర్యాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Deputy CM Bhatti Vikramarka on MLA Premsagar Rao: ” ప్రేమ్ సాగర్ రావు నిద్రపోతారో లేదో నాకు తెలియదు కానీ, మమ్మల్ని మాత్రం నిద్రపోనివ్వడం లేదు. వస్తున్నాడు.. ఫోన్ చేస్తున్నాడు… అంటేనే భయమేసి ఉలిక్కిపడాల్సిన పరిస్థితి వస్తోంది. అందరూ అలర్ట్‌గా ఉండండి, ఆయన వచ్చాడంటే ఏదో ఒకటి అడుగుతాడు, వద్దన్నా ఆపడనే సత్యాన్ని ఇక్కడి అధికారులు, నా దగ్గర పనిచేసే స్టాఫ్ అందరూ అలవాటు చేసుకున్నారు” – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మంచిర్యాల పట్టణ ప్రగతిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ప్రశంసల వర్షం కురిపించారు. మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్‌లో మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధుల సంకల్పం, నిబద్ధత వల్లే మంచిర్యాలలో అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. నిన్న నేను, మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు(MLA Premsagar Rao) కలిసి మంచిర్యాల పట్టణంలో పర్యటించాము. అక్కడ రోడ్ల విస్తరణ, డ్రైనేజీ పనులను చూసి చాలా సంతోషం వేసింది. అభివృద్ధి చేయాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని ఇక్కడి పనులు నిరూపిస్తున్నాయని భట్టి విక్రమార్క సంతోషం వ్యక్తం చేశారు.
మేమే కొన్ని పనులు చేయలేకపోయాం…
కొన్ని సందర్బాల్లో తామే సొంత నియోజకవర్గాల్లోనూ నిధులు విడుదల చేసినా కొన్ని పనులు చేయలేకపోయామని భట్టి స్పష్టం చేశారు. కానీ, మంచిర్యాలలో పనులు జరుగుతున్న తీరు చూసి ముచ్చటేసిందన్నారు. అందుకే రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులను, కమిషనర్లను ఇక్కడికి పంపించి, ఈ అభివృద్ధిని ఒక మోడల్‌గా చూసి స్ఫూర్తి పొందేలా చేయాలని ఉదయం శ్రీధర్ బాబుతో అన్నాను. ఈ అభివృద్ధికి సహకరించిన ప్రజలు, వ్యాపారులకు అభినందనలు తెలిపారు.
ఇక్కడ చూసి నేను మంజూరు చేయించుకున్నా..
గతంలో పాదయాత్ర సమయంలో వరద ముప్పు ఉన్న ప్రాంతంలో హాస్పిటల్ నిర్మించడం వల్ల గర్భిణీల ఇబ్బందులు చూపించారు. ప్రభుత్వం రాగానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని మాట ఇచ్చాం. అన్నట్టుగానే, చాలా వేగంగా ప్లానింగ్ పూర్తి చేసి, అనుమతులు తెచ్చుకుని, భూమి పూజ చేసి పనులు వేగంగా ప్రారంభించడం ఆశ్చర్యం కలిగించింది. అలాగే ఇక్కడి 50 బెడెడ్ హాస్పిటల్ ఆర్కిటెక్చర్, విశాలమైన వరండాలు, గాలి వెలుతురు వచ్చేలా కట్టిన విధానం నచ్చి.. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వారిని కూడా వచ్చి చూడమని చెప్పాను. ఇది చూశాకే నా నియోజకవర్గానికి కూడా 50 పడకల హాస్పిటల్ మంజూరు చేయించుకున్నానని భట్టి వెల్లడించారు.
నాకు ఇవ్వలేదు.. ప్రేంసాగర్ రావుకు ఇచ్చావ్..
పక్కనే ఉన్న మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశిస్తూ.. “నాయనా, నాకో ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ చేయి అని చాలాసార్లు అడిగాను, రెండున్నర ఏళ్లు అవుతున్నా నా నియోజకవర్గానికి మాత్రం ఇంకా రాలేదు. కానీ ప్రేంసాగర్ రావు మాత్రం మంచిర్యాలకు మాత్రం ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేయించుకోవడమే కాకుండా, చాలా వేగంగా ఇండస్ట్రియల్ పార్క్ పనులు కూడా ప్రారంభించారు. అంతేకాదు, రాష్ట్రంలో ఎవరూ తీసుకోని ఒక ‘ఫిష్ పాండ్’ (చేపల చెరువు) కూడా ఇక్కడికి తెచ్చేసుకున్నార”ని ప్రశంసించారు.
ఆయనకు ఉన్నత పదవులు రావాలి…
ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టకుండా మంచిర్యాల అభివృద్ధి కోసం దశాబ్దాల తర్వాత ఒక మంచి ప్రజాప్రతినిధిని ప్రజలు గెలిపించుకున్నారని, ఇందుకు మంచిర్యాల ప్రజలను అభినందిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకు మరిన్ని ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు, మంచిర్యాల మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.