సింగరేణి కార్మికులను వేధిస్తున్నరు
-సింగరేణి నష్టాలకు కాంగ్రెస్ అవినీతే కారణం
-సంస్థ ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతోంది
-నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తున్నాం
-ఓపెన్‌కాస్ట్‌లతో పాటు అండర్‌గ్రౌండ్ గనులు ప్రారంభించాలి
-తెలంగాణ బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని విజ్ఞప్తి
-ఆదాయ పన్ను సమస్య పరిష్కరించాలని కల్వకుంట్ల కవితడిమాండ్
Kalvakuntla Kavitha:తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సింగరేణిలో కార్మికుల పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) విమర్శించారు. కార్మికుల పట్ల యాజమాన్యం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని, సమస్యలపై ప్రశ్నించే ఉద్యోగులను అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులకు ప్రభుత్వ అలసత్వమే కారణమని దుయ్యబట్టారు. మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణలో ఓపెన్‌కాస్ట్ గనులతో పాటు సమానంగా అండర్‌గ్రౌండ్ గనులను కూడా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఇటీవల ఉప ముఖ్యమంత్రి సింగరేణి ప్రాంతంలో పర్యటించినప్పటికీ కార్మికుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదని కవిత విమర్శించారు. 2012లో కాంగ్రెస్ పార్టీ బొగ్గు కుంభకోణానికి పాల్పడిందని, అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను చేపట్టిందని కవిత పేర్కొన్నారు. దీంతో సింగరేణి కూడా వేలంపాటల్లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణకు సంబంధించిన బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించేలా కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (G. Kishan Reddy) జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు.
నాలుగు లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తున్నం…
సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ఆదాయ పన్ను (ఐటీ) సమస్యను వెంటనే పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే ఐటీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం సరికాదని ఆమె విమర్శించారు. రాష్ట్రంలోనూ, సింగరేణి ప్రాంతంలోనూ బీజేపీకి గెలిచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల అమలు తమ పార్టీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేసిన కవిత, వాటిని అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు ప్రారంభం..
మంచిర్యాల ఎమ్మెల్యే గుండాగిరి రాజకీయాలకు స్వస్తి చెప్పాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన రాజకీయ కార్యకలాపాలు ఈ ప్రాంతం నుంచే ప్రారంభమవుతాయని, ప్రజల ఆదరణతో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపరమైన విధానాలే కారణమని కవిత ఆరోపించారు. మేం సింగరేణి పర్యటన చేపట్టనున్నట్లు తెలిసిన వెంటనే రాజకీయ ప్రత్యర్థులు ఇక్కడకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ మాత్రమే పోరాటం చేస్తున్నయ్..
సింగరేణి హక్కులను కాపాడేందుకు హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ మాత్రమే పోరాడుతున్నాయని కవిత పేర్కొన్నారు. సంస్థలో అధికారుల పరిధిలో ఉండాల్సిన పనులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తోందని, సమస్యలను పరిష్కరించే అధికారంలో ఉన్నవారే ప్రతిపక్షాల మాదిరిగా కార్మికుల వద్దకు వెళ్లడం విచిత్రంగా ఉందని విమర్శించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వాలు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.