ఇంద్రవెల్లి స్ఫూర్తితో పోరాటం..
-ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగాలను తెలంగాణ ఎన్నటికీ మరువదు
-'తెలంగాణ రక్షణ సేన'లో ఆదివాసీల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు
-ఉచిత విద్య, ఉచిత వైద్యం సహా ఐదు ప్రధానాంశాలతో పార్టీ ముందడుగు
-ప్రతిపక్షంగా ఆదివాసీ బిడ్డల సమస్యలపై రాజీలేని పోరాటం
ఇంద్రవెల్లి అంటేనే స్ఫూర్తినిచ్చే ఒక పోరాటం గుర్తుకు వస్తుందని, ఇంద్రవెల్లి విషాదాన్ని, వారి త్యాగాలను తెలంగాణ ఎన్నటికీ మరిచిపోదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ఆమె మాట్లాడారు. మా నినాదం కూడా సామాజిక తెలంగాణయేనని. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదివాసీల అంశంపై పోరాటం చేయాల్సి ఉందన్నారు కవిత.. ఆ స్ఫూర్తిని పొందేందుకు ఇంద్రవెల్లి వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చామని వెల్లడించారు.
వేరే ఏ పార్టీలో లేని విధంగా తెలంగాణ రక్షణ సేన లో ఆదివాసీల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామని హామీ ఇచ్చారు. ఆదివాసీల్లో ఉన్న 9 తెగలను కలుపుకొని వారి కోసం బలంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆదివాసీల ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చామని వెల్లడించారు. మీకు ఏ సమస్య వచ్చిన సరే మేం ఉన్నామని గుర్తు పెట్టుకోండని తెలిపారు. మీ కోసం మీ తరఫున మేము పోరాటం చేస్తామని మీకు హామీ ఇస్తున్నానని కవిత వెల్లడించారు. నాగోబా దేవుడు అంటే నాకు చాలా సెంటిమెంట్ అని, పార్టీ పెట్టక ముందు ఇక్కడ వచ్చి పార్టీ పెట్టిన తర్వాత మళ్లీ వస్తానని మొక్కుకున్నా అని కవిత తెలిపారు. ఇవ్వాళ నాగోబాని కూడా దర్శించుకోబోతుండటం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ సాధించుకున్న 12 ఏళ్ల తర్వాత కూడా ఆదివాసీల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిర్యాణి లాంటి మండల్లాల్లో రోడ్లు సరిగా లేవని… కరెంట్ రాని చాలా గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయన్నారు. తెలంగాణ రక్షణ సేన ప్రధానంగా ఐదు అంశాలను పెట్టుకుందని, అందులో ఉచిత విద్య, ఉచిత వైద్యం కీలకమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడకు వచ్చి చాలా హామీలు ఇచ్చాడని, మీ కోసం ప్రత్యేకంగాగా డీఎస్సీ కూడా వేస్తామని చెప్పాడు. దాని కోసం ఆదివాసీ బిడ్డలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి ప్రతిపక్షంగా పనిచేస్తామని, అధికారంలోకి వచ్చాక ఆదివాసీలను అగ్రభాగాన అభివృద్ది పథంలో నడిపిస్తామని కవిత హామీ ఇచ్చారు.