అన్నలంతా మా పార్టీలోనే ఉన్నారు..
-మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే ఊరుకోం
-తల్లి కాంగ్రెస్‌తోనే కొట్లాడినం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఎంత...?
-కాంట్రాక్టర్లకు పైసలు ఉంటాయి.. కార్మికులకు ఉండవా..?
-కార్మికులను వేధిస్తే అధికారులపై కేసులే
-ఆఫీసర్లకు అన్నీ.. కార్మికులకు ఏమీ లేవు
-తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు
Telangana Rakshana Sena Chief Kalvakuntla Kavitha:గతంలో గనుల్లో ‘అన్నలు’ ఉన్నప్పుడు అధికారులు కొంత పద్ధతిగా నడుచుకునేవారు.. ఇప్పుడు అన్నలు లేరనే ధీమాతో కార్మికులను వేధిస్తున్నారు. “అన్నలు లేరని అనుకుంటున్నారేమో.. వాళ్లంతా ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు. కార్మికులను మానసికంగా, శారీరకంగా వేధిస్తే ఊరుకునేది లేదు.. అలాంటి అధికారులపై కేసులు పెడతాం” అని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “బాయిబాట” కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీరాంపూర్ RK 7 గనిని సందర్శించిన ఆమె కార్మికులతో మాట్లాడారు.
కార్మికుల కనీస అవసరాలు తీర్చకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ దుయ్యబట్టారు. గనుల్లో రాత్రింబవళ్లు కష్టపడే కార్మికులకు కనీస సదుపాయాలు కల్పించడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలమైందని కవిత మండిపడ్డారు. గనిలోకి వెళ్లే కార్మికులకు కనీసం తాగడానికి మంచి నీళ్లు, పీల్చడానికి గాలి కూడా అందడం లేదని, ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనేనని ఆమె ధ్వజమెత్తారు. ప్రపంచమంతా అత్యాధునిక సాంకేతికత వాడుతుంటే, సింగరేణి యాజమాన్యం మాత్రం పాత టెక్నాలజీతో కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, పాడైపోయిన మెషీన్లను కార్మికులే రిపేర్ చేసుకుని వాడుకోవాల్సిన దుస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా పోరాటం వల్లనే సింగరేణిలో మహిళలు..
తాము పార్లమెంట్‌లో పోరాడి సాధించిన మహిళా ఉద్యోగాల వల్ల నేడు సింగరేణిలో మహిళలు కనిపిస్తున్నందుకు సంతోషంగా ఉందన్న కవిత.. వారికి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం యాజమాన్యం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన తమ పార్టీ.. కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు. తాము ఖచ్చితంగా భవిష్యత్తులో అధికారంలోకి వస్తామని, అండర్ గ్రౌండ్ మైనింగ్‌ను మళ్లీ తెరిపించి లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని కవిత భరోసా ఇచ్చారు. అవినీతిపై నిరంతరం పోరాడే హెచ్‌ఎంఎస్ (HMS) అధ్యక్షుడు రియాజ్ తో కలిసి, టీఆర్ఎస్ కార్మికుల హక్కుల కోసం నిరంతరం కొట్లాడుతుందని.. కార్మికులంతా తమను ఆశీర్వదించాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
కాంట్రాక్టర్లకు పైసలు ఉంటాయి.. కార్మికులకు ఉండవా?
“ఆఫీసర్లకు, కాంట్రాక్టర్లకు కావాల్సిన అవసరాలు తీర్చేందుకు యాజమాన్యం దగ్గర డబ్బులు ఉంటాయి కానీ.. కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చినా పైసలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు” అని కవిత ఆరోపించారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చే వాటాలో సగానికి పైగా దాచేస్తూ మోసం చేస్తున్నారని, గతంలో ఇచ్చిన దానికంటే రూ. 10 వేలు అదనంగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. క్వార్టర్ల కేటాయింపు, ఐటీ భారాల వల్ల కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె ఏకరువు పెట్టారు.
డిపెండెంట్ ఉద్యోగాల్లో అన్యాయం.. మెడికల్ బోర్డు ఏది?
డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని కవిత విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా ‘అన్-ఫిట్’ చేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “మొన్న డిప్యూటీ సీఎం వచ్చి 350 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. కానీ ఇంకా రెండు వేల మంది ఉద్యోగాల కోసం చాకచక్యంగా ఎదురుచూస్తున్నారు. నెలకు రెండుసార్లు నిర్వహించాల్సిన మెడికల్ బోర్డును ఎందుకు నిర్వహించడం లేదు?” అని ప్రశ్నించారు.
పిల్ల కాంగ్రెస్‌తో కొట్లాడలేమా..?
తాము మైన్ సందర్శనకు వస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందని, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గతంలో ఇక్కడ మీటింగ్‌లు పెట్టలేదా అని ఆమె నిలదీశారు. “నాడు తల్లి కాంగ్రెస్‌తోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం.. ఇప్పుడున్న పిల్ల కాంగ్రెస్‌తో కొట్లాడలేమా?” అంటూ కవిత వెల్లడించారు. గోదావరి వ్యాలీలో ఉన్న కోల్ బ్లాక్స్ ప్రైవేట్ సంస్థల పరం కాకుండా సింగరేణికే ఎక్కువ బ్లాక్‌లు వచ్చేలా కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని డిమాండ్ చేశారు.