మంచిర్యాలలో మంత్రికి నో ఎంట్రీ

రాష్ట్ర మంత్రి అంటే రాష్ట్రంలో ఎక్క‌డికైనా వెళ్లిరావ‌చ్చు.. కానీ, ఓ మంత్రి ప‌ర్య‌ట‌న‌కు మాత్రం హ‌ద్దులున్నాయ్‌… ఆ హ‌ద్దులు దాటి ముందుకు వెళ్ల‌లేరు.. సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం కాలు పెట్ట‌లేక‌పోతున్నారు. కాదు.. కాదు.. కాలు పెట్ట‌నివ్వ‌డం లేదు. అది కూడా త‌న జిల్లా, ప‌క్క‌నే ఉన్న నియోక‌వ‌ర్గంలో.. చివ‌ర‌కు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క వ‌చ్చినా ఆయ‌న రాలేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.. ఇంత‌కీ ఎవ‌రా మంత్రి..? ఎందుకు రావ‌డం లేదు..? ఆయ‌న‌ను అడ్డుకుంటున్న‌ది ఎవ‌రు..? నాంది న్యూస్ ప్ర‌త్యేక క‌థ‌నం..

ఆయ‌న మంత్రి అయ్యి ఏడాది పూర్త‌య్యింది.. అయితే ఆయ‌న‌కు సొంత పార్టీలో, పైగా సొంత జిల్లాలోనే త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. ఆయ‌న ఎన్నిక‌ల వ‌ర‌కు వేరే పార్టీలో ఎన్నిక‌ల ముందే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయ‌న వ‌చ్చీ రావ‌డంతో త‌న‌కు, త‌న అన్న వినోద్‌కు టిక్కెట్టు సాధించుకున్నారు. అంతేకాకుండా, త‌న కొడుకు వంశీకి సైతం పెద్ద‌ప‌ల్లి ఎంపీ టిక్కెట్టు సంపాదించిపెట్టారు. ఇదంతా ఒక్కెత్తు కాగా, మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేశారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి కూడా అయ్యారు. అయితే, మంత్రి ప‌ద‌విపై ఆశ‌పెట్టుకున్న ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తాను ఎన్నో ఏండ్లుగా పార్టీని ప‌ట్టుకుని ఉంటున్నాన‌ని, త‌నపై ఎన్నో కేసులు కూడా న‌మోదు అయినా, వాట‌న్నింటిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని ప‌టిష్టం చేశానని ప్రేంసాగ‌ర్ రావు ఆవేద‌న చెందారు.

కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచించిదో ఏమో కానీ… ప్రేంసాగ‌ర్ రావును కాద‌ని వివేక్‌కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. దీంతో అటు ప్రేంసాగ‌ర్ రావు, ఆయ‌న అనుచ‌ర‌వ‌ర్గం వివేక్ అంటే మండి ప‌డుతున్నారు. తాము కేసుల‌కు భ‌య‌ప‌డ‌కుండా, ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌కుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే అన్ని పార్టీలు తిరిగి వ‌చ్చిన వివేక్‌ను మంత్రి చేయ‌డం ఏమిట‌నే వాద‌న తెర పైకి తెచ్చారు. పార్టీలు మారిన ప‌దవులు ఇచ్చి, త‌న‌ను ప‌క్క‌న పెట్టింద‌ని ప్రేం సాగ‌ర్ రావుతో పాటు ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం మంత్రి వివేక్‌పై గుర్రుగా ఉంది. చివ‌ర‌కు ప్రేంసాగ‌ర్ రావుకు ఫుడ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చినా ఆయ‌న క‌నీసం ప్ర‌మాణ స్వీకారం కూడా చేయ‌లేదు.

త‌మ నేత‌కు అన్యాయానికి కార‌ణం, త‌మ నేతకు ద‌క్కాల్సిన మంత్రి ప‌ద‌వి గ‌ద్ద‌లా త‌న్నుకుపోయిన గ‌డ్డం వివేక్‌పై ప్రేంసాగ‌ర్ రావు అనుచ‌రులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఎంపీ ఎన్నిక‌ల స‌మయంలో త‌న కొడుకు వంశీకృష్ణ‌ను గెలిపిస్తే ప్రేంసాగ‌ర్ రావు మంత్రి ప‌ద‌వికి తాను అడ్డురానని చెప్పిన వివేక్ తీరా మంత్రి కావ‌డం జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్రేంసాగ‌ర్ రావు, ఆయ‌న అనుచ‌రవ‌ర్గం త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో అడ్డుపెట్టొద్ద‌ని ఏకంగా మంత్రి వివేక్‌కే అల్టిమేటం జారీ చేశారు. ఒక‌వేళ మంత్రి మంచిర్యాల వ‌స్తే గొడ‌వ‌లు త‌ప్ప‌వ‌ని, ఆయ‌న‌ను మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్ట‌నీయ‌మ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు.

దీంతో ఎందుకైనా మంచిద‌ని మంత్రి వివేక్ కూడా ఆ నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నారు. ఆయ‌న జిల్లా కేంద్ర‌మైన మంచిర్యాల‌లో అడుగుపెట్ట‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. మంత్రి ప‌ద‌వి ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్పుడు సైతం ఇందారం మీదుగా చెన్నూరు నుంచి అటు వైపుగా మంద‌మ‌ర్రి వెళ్లిన మంత్రి మంచిర్యాల‌లో మాత్రం అడుగుపెట్ట‌లేదు. ప్రేంసాగ‌ర్ రావు, ఆయ‌న అనుచ‌రుల హెచ్చ‌రిక‌ల పుణ్య‌మా అని మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గం రావ‌డం లేదు. ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు, ఆయ‌న అనుచ‌రులు మంత్రిని మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్ట‌నిచ్చేది లేదంటూ భీష్మించుకున్నారు.

మంచిర్యాల‌లో నిర్వ‌హించిన ఎన్నో కార్య‌క్ర‌మాలకు ప్రేంసాగ‌ర్ రావు మంత్రి వివేక్‌ను పిల‌వ‌నేలేదు.. మంత్రి వివేక్ కూడా ఏ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ‌చ్చినా వివేక్ రాక‌పోగా, తాజాగా ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌తో స‌హా మంత్రులు శ్రీ‌ధ‌ర్ బాబు, అడ్లూరి ల‌క్ష్మినారాయ‌ణ‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌తో స‌హా ప‌లువురు నేత‌లు గూడెంలో దేవాల‌య అభివృద్ది ప‌నులు, ఎత్తి పోత‌ల ప‌థ‌కాల‌కు ప్రారంభోత్స‌వాలు చేశారు. సింగ‌రేణి ప్రాంతంలో ప‌ర్య‌టించారు. సింగ‌రేణిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి సైతం కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు అంతా వ‌చ్చారు. భ‌ట్టి విక్ర‌మార్క రెండు రోజులు మంచిర్యాల‌లో ఉన్నారు. కానీ, మంత్రి వివేక్ మాత్రం మంచిర్యాల‌కు రాలేదు. రెండ‌వ రోజు మంత్రి వివేక్ జిల్లాలోనే ఉన్నా మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గం వైపు మాత్రం క‌న్నెత్తి చూడ‌లేదు.

ఇలా ఏకంగా మంత్రి వివేక్ భ‌ట్టి ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉండ‌టం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ప్రేంసాగ‌ర్ రావు పిల‌వ‌లేదా..? మంత్రి వివేక్ కావాల‌నే రాలేదా అనే చ‌ర్చ జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో, ప్ర‌జ‌ల్లో సాగుతోంది. త‌న జిల్లాలోని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి అడుగుపెట్ట‌క‌పోవ‌డం అనే విష‌యం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like