మీ సేవ కేంద్రాల్లో కొత్త నిబంధనలు
Telangana Meeseva : ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాలను పేపర్‌లెస్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మేరకు పలు నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు డిజిటలైజేషన్‌ను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో జూన్ 19 నుంచి మీ సేవా కేంద్రాల్లో కాగితపు రశీదులు విధానానికి స్వస్తి పలికి, కేవలం ఎస్ఎంఎస్ ల ద్వారా మాత్రమే రశీదులు ఇవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
మీ సేవ కేంద్రంలో ఏదైనా సర్టిఫికెట్… సేవ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు గతంలో కాగితపు రశీదు అందచేసేవారు. అయితే, మారిన నిబంధనల క్రమంలో ఇక నుంచి మీరు రిజిస్టర్ సమయంలో కాగితపు రశీదు ఇవ్వరు. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు నేరుగా ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ డిజిటల్ రిసీప్ట్ లోనే మీరు దరఖాస్తు చేసిన సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలు, ట్రాన్సాక్షన్ వివరాలు, అత్యంత ముఖ్యమైన అప్లికేషన్ నంబర్ వంటి అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి. అయితే, అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న సరైన మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. లేదంటే రశీదు రాదు… మన దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవటం కష్టమవుతుంది.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా రశీదులను చాలా సులభంగా వినియోగదారుడి స్మార్ట్‌ఫోన్‌లోనే నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవసరమైతే భవిష్యత్తు వినియోగంకోసం ఆ లింక్ ద్వారా ఎక్కడి నుండైనా ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ దరఖాస్తుదారుడికి ప్రభుత్వం నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్ జారీ కాకముందే వారి మొబైల్ ఫోన్ నుంచి ఆ ఎస్ఎంఎస్ పొరపాటున డిలీట్ అయితే కంగారు పడాల్సిన పనిలేదు. మీ సేవా కేంద్రాల్లో రిసెండ్ ఆప్షన్ ద్వారా మళ్లీ అదే రశీదును సంబంధిత దరఖాస్తుదారుడి మొబైల్ కు పంపేలా ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.