కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి..!
-రైతు ఆత్మహత్యలన్నీ .. రేవంత్ హత్యలే
-రైతులు ఆత్మహత్యలు చేసుకోకండి
-ఆత్మహత్య బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి
-రైతు కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థికసాయం అందించిన కేటీఆర్
BRS Working President KTR:రైతుల పంట కొనుగోళ్లు చేయకపోతే కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధుల కాలర్ పట్టి నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన హత్యలేనని దుయ్యబట్టారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు పాండు రంగ్ ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పిల్లలను ఓదార్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని పిల్లలను అనాథలుగా చేయవద్దని కోరారు. రెండేళ్లు రైతులు ధైర్యంగా ఉంటే మళ్లీ కేసీఆర్ వస్తాడు ..ఒక్కొక్క రైతన్నను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడనీ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కిందని, రైతుల బతుకులు ఆగమాగం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారాయన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లు రూ. 500 బోనస్ ఇవ్వకపోగా, ప్రైవేటు మార్కెట్లో దళారులకు రూ. 2,000 కే అమ్ముకునే దయనీయ పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని మండిపడ్డారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని విమర్శించారు. పాండురంగ కుటుంబానికి ఉన్న రూ. లక్షన్నర రుణంలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని ఆయన భార్య కన్నీరుమున్నీరుగా విలపించారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం మూడు సార్లు రైతుబంధును ఎగ్గొట్టిందని, కనీసం రైతు బీమా ప్రీమియం కూడా కట్టకపోవడం వల్ల రాష్ట్రంలో దాదాపు 7 వేల క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాండురంగ కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చదువుకుంటున్న ఆయన ముగ్గురు పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుని, వారికి ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని స్పష్టం చేశారు.
రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకుని తమ కుటుంబాలను అనాథలను చేయవద్దని, ధైర్యంగా పోరాడాలని కేటీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం పంటలు కొనకపోతే నాయకుల కాళ్లు పట్టుకోవద్దని, వాళ్ళ కాలర్ పట్టుకుని నిలదీయాలని, రోడ్డెక్కకుండా కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు కూర్చొని తమ హక్కుల కోసం ప్రశ్నించాలని సూచించారు. రైతులకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ అధికారంలో వస్తారని భరోసా ఇచ్చారు. వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రైతుల ఉసురు తీసుకుంటున్న ఈ మరణాలు ఆత్మహత్యలు కావని, ఇవి ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయించిన హత్యలేనని కేటీఆర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy), మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna), ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్( Anil Jadhav), కోవ లక్ష్మి(Kova Lakshmi), పాడి కౌశిక్ రెడ్డి( Padi Kaushik Reddy), డాక్టర్ సంజయ్, పార్టీ నాయకులు జాన్సన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.