ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధమైన బస్సు
తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్సులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ డిపోకు చెందిన ఈ బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరగా, తిమ్మాపూర్ మండలం అలుగునూర్ శివారులోని కాకతీయ కాలువ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ ప్రశాంత్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డుపక్కన ఆపాడు. సిబ్బంది సహాయంతో డోర్లు, ఎమర్జెన్సీ గేట్లు తెరిచి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దింపారు. అనంతరం బస్సులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, మంటలు వేగంగా వ్యాపించడంతో ఫలితం లేకపోయింది.
కేవలం ఐదు నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని ఆవరించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, బస్సు పూర్తిగా కాలిపోవడంతో భారీ ఆస్తినష్టం జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్న అధికారులు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ చేపట్టారు. ఘటన కారణంగా కరీంనగర్–హైదరాబాద్ మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.