రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు
ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు
రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు(MLA Premsagar Rao) స్పష్టం చేశారు. లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి (చందారం)లో రైతు పొదుపు, పరపతి, మార్కెటింగ్ పరస్పర సహాయక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ విత్తన ఉత్పత్తి–విత్తన శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి నష్టం లేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించి తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలతో రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతు సంక్షేమంలో రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో వరి ధాన్యంతో పాటు దాదాపు 22 వేల టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా రూ.452 కోట్ల చెల్లింపులు జరగగా, మంచిర్యాల నియోజకవర్గంలోనే సుమారు రూ.270 కోట్ల మేర రైతులకు చెల్లింపులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈసారి ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం కేంద్రాలు ఐకేపీకి కేటాయించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లారీలు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి ఎకరాకు 28 నుంచి 32 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడి వచ్చిందని వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) మాట్లాడుతూ రైతుల కోసం విత్తన ఉత్పత్తి, శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లాలో దాదాపు 2 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు పూర్తయిందని, మరో 12 వేల క్వింటాళ్ల కొనుగోలుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామని, ఇప్పటికే 98 శాతం రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో డీసీపీ ఏ. భాస్కర్(DCP A. Bhaskar), జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ(District Agriculture Officer Surekha) తదితరులు పాల్గొన్నారు.