ఎత్తుకు పై ఎత్తు
సింగరేణిలో ప్రస్తుతం బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు సంబంధించి లొల్లి నడుస్తోంది. దీని విషయంలో తాము ముందుండాలంటే, తాము ముందుండాలని అన్ని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. దీంతో ఎవరికి వారు ఈ విషయంలో వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
సింగరేణిలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానిపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. దీంతో కార్మిక సంఘాలు ముందుకు కదిలాయి. రానున్న ఎన్నికల్లో ఎంత మేరకు ఓట్లు సాధించుకోగలమనే లెక్కలు వేశాయి. ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు బ్లాక్‌లను వేలం వేయనిచ్చేది లేదని కార్మకులను సమ్మెలోకి దించాయి.
ముందే సమరశంఖం పూరించిన టీబీజీకేఎస్…
వాస్తవానికి అన్ని కార్మిక సంఘాలు కలిసి ముందుకు వెళ్లాయని మొదటే నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి జాతీయ కార్మిక సంఘాలు టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్‌కు విషయం చెప్పాయి. అయితే దీనిపై పూర్తి స్థాయిలో తమకే క్రెడిట్ రావాలని భావించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిసెంబర్ 9 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ముందుగానే ప్రకటించింది. దీంతో అవాక్కవడం జాతీయ కార్మిక సంఘాల వంతైంది. ఏం చేయాలో అర్దం కాక తలలు పట్టుకున్నారు. ఖచ్చితంగా టీబీజీకేఎస్‌ను కలుపుకుపోవాల్సిందేనని లేకపోతే గతంలో జరిగిన విధంగా సమ్మె విచ్ఛిన్నం కాక తప్పదని భావించిన జాతీయ కార్మిక సంఘాలు టీబీజీకేఎస్ నేతలతో సమాలోచనలు జరిపి జేఏసీ రూపంలో ముందుకు వెళ్లాలని భావించాయి.
ఒక అడుగు ముందుకేసిన బీఎంఎస్..
ఎట్టకేలకు మూడు రోజుల సమ్మె విజయవంతం అయ్యింది. ఒక రకంగా ఈ సమ్మె జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించినా తమకు క్రెడిట్ దక్కాలని భావిస్తున్నాయి. దీంట్లో భాగంగా విడివిడిగా పత్రికా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఇక సింగరేణి మధ్యవర్తిత్వంతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో చర్చలు జరగాల్సి ఉండగా, బీఎంఎస్ ఒక అడుగు ముందుకు వేసింది. ముందుగానే అక్కడికి చేరుకున్న సింగరేణి నేతలు జాతీయ నేతల ద్వారా కేంద్ర మంత్రిని కలిశారు. బొగ్గు బ్లాక్‌ల వేలానికి సంబంధించి ఆయనతో సానుకూల ప్రకటన చేయించారు. దీంతో బీఎంఎస్ ఈ విషయంలో ముందడుగు వేసింది. బొగ్గు బ్లాక్‌ల విషయంలో కేంద్రంతో మాట్లాడి ఒప్పించామన్న సంకేతాన్ని కార్మికులకు పంపించింది.
అయితే ఈ విషయంలో తాము పోరాటం చేయడం వల్లనే కేంద్రం వెనక్కి తగ్గిందని అటు టీబీజీకేఎస్‌తో పాటు జాతీయ కార్మిక సంఘాలు సైతం ప్రచారం చేసుకునేందుకు సిద్దమయ్యాయి. మరి కార్మికులు ఎవరి మాట నమ్ముతారో వేచి చూడాల్సిందే.