సూర్యుడ్ని టచ్ చేసిన నాసా
ఇంతకాలంపాటు అసాధ్యంగా భావించిన అత్యద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మూడేళ్ల క్రితం అంటే.. 2018లో ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక సూర్యుడిని ముద్దాడింది. భానుడి బాహ్య వాతావరణ పొర ‘కరోనా’ను తాకింది. ఇక్కడ ఉష్ణోగ్రత 11 లక్షల డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉంటుంది. నాసా సాధించిన ఈ అద్భుత విజయం విశ్వంలోని మరిన్ని గుట్టుమట్లను విప్పేందుకు దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
సూర్యుడిని తాకిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ ఏడేళ్లపాటు కరోనా పొరపై పరిశోధనలు చేస్తుంది. ఈ ప్రోబ్‌ను 26 సార్లు సూర్యుడికి అతి దగ్గరగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న తొలిసారి కరోనా పొరల్లోకి ఇది ప్రవేశించింది. ఈ సందర్భంగా భవిష్యత్ పరిశోధనల కోసం కొన్ని రేణువులను కూడా సేకరించింది.
ఈ నౌక సూర్యుడికి మరింత దగ్గరగా వెళ్లినప్పుడు సూడోస్ట్రీమర్ అనే అయస్కాంత క్షేత్రం ఎదురైంది. చుట్టూ ఉన్నదానితో పోలిస్తే అక్కడి వాతావరణం కొంత నిలకడగా ఉన్నట్టు గుర్తించారు. మున్ముందు ఇది సూర్యుడికి మరింత చేరువగా వెళ్తుంది. భానుడి నుంచి వెలువడే అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా పార్కర్ ప్రోబ్ కవచాన్ని రూపొందించారు.
సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో కనిపించేకరోనల్ నిర్మాణాల గుండా ప్రవేశించింది.సూర్యుడి ఉపరితలం ఘన రూపంలో ఉండదు.ఈ నక్షత్ర గురుత్వాకర్షణ శక్తి.. ఆయస్కాంత క్షేత్రం. ప్లాస్మాను పట్టి ఉంచలేనంత బలహీనంగాఉన్న అంచును అల్ఫ్ వెస్ ఉపరితలంగా పిలుస్తారు.
దీన్నే సూర్యుడి సరిహద్దుగా చెబుతారు. దాని తర్వాతి భాగం నుంచి సౌర గాలులు ఉత్పత్తి అయి.. సౌర కుటుంబంనుంచి బలంగా వీస్తాయి. అల్ఫ్ వెన్ ఎలా ఉంటుంది? అక్కడి వాతావరణం మాటేమిటి? లాంటివేమీ తెలీవు. దాని గుట్టు విప్పటమే తాజా ప్రయోగ లక్ష్యం. తాజా పరిణామంతో మనిషి సాధించిన అద్భుత ఖగోళ విజయంగా చెప్పొచ్చు.