ఆ బ్లాక్‌లు సింగరేణికే కేటాయించాలి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన బీఎంఎస్ నేతలు
సింగరేణి ప్రాంతంలో వేలం వేయాలనుకున్న బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలని బీఎంఎస్ నేతలు కోరారు. సింగరేణి సమస్యలపై సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్, బీఎంఎస్ ప్రతినిధులు కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి గారిని కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రితో పలు విషయాలపై మాట్లాడారు. ఈ బ్లాక్ లను కేవలం సింగరేణికి కేటాయించడం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి నాలుగు బొగ్గు బ్లాకులను వేలం నుంచి తొలగించే అంశాన్ని బొగ్గు శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి సానుకూలంగా నిర్ణయం వచ్చే విధంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. హెచ్‌పిసి వేతనాలు, ఎక్స్‌గ్రేషియా తదితర కాంట్రాక్టు కార్మికుల సమస్యలను బొగ్గు శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. సమస్యలపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు సింగరేణి ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి ప్రగతిపై టీఆర్ఎస్కు ఏమాత్రం ఆసక్తి కనిపించడం లేదన్నారు సత్సంబంధాలు, వ్యక్తిగత సమాలోచనలతో సమస్యలను పరిష్కరించుకునే బదులు సింగరేణి యాజమాన్యం , టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రాజకీయాలు చేస్తోందన్నారు. రాష్ట్ర విద్యుత్తు సంస్థల నుంచి బొగ్గు, విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఆర్థిక స్థితిని తీవ్రంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 15,000 కోట్లకు పైగా బకాయిలు పెరిగాయన్నారు. సమస్యలను సక్రమంగా పరిష్కరించడంలో సింగరేణి యాజమాన్యం ఘోరంగా విఫలమైందన్నారు. సింగరేణి, రాష్ట్ర పురోగతి పట్ల బిఎంఎస్ సింగరేణి విభాగం కృషిని, శ్రద్ధను మంత్రి అభినందించారు. అంతేకాకుండా కేంద్రం నుండి అన్ని రకాల సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చినట్లు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్, బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి పి. మాధవ నాయక్ వెల్లడించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఏబీకేఎంఎస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పులి రాజా రెడ్డి, బీఎంఎస్ తెలంగాణా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రమాకాంత్, యూనియన్ అద్యక్షులు యాదగిరి సత్తయ్య తదితరులు ఉన్నారు.