శబరిమల రైళ్లలో ఇలా చేస్తే జైలుకే..
శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. ఉల్లంఘనటకు పాల్పడితే జైలుకేనని హెచ్చరికలు జారీ చేసింది.
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి కొల్లాం మధ్య అందుబాటులో ఉంటాయని గతవారం వెల్లడించింది. ఈ ప్రత్యేక రైలు డిసెంబర్ 17న సికింద్రాబాద్ నుంచి కొల్లం స్టేషన్కు (07109) బయల్దేరనుంది. కొల్లాం నుంచి సికింద్రాబాద్ (07110)కు డిసెంబర్ 19న స్పెషల్ రైలు బయల్దేరుతుందని పేర్కొంది.
ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి,జనగామ,కాజీపేట,వరంగల్,మహబూబాబాద్,డోర్నకల్,ఖమ్మం,విజయవాడ,తెనాలి,చీరాల,ఒంగోలు,నెల్లూరు,గూడూరు,రేణిగుంట,జోలార్పెట్టై,సేలం,ఈరోడ్,కోయంబత్తూర్,పాలక్కడ్,త్రిశూర్,ఎర్నాకులం,కొట్టాయం,చెంగన్చెరి,చెంగనూరు,మావలికర, కయాంకులం స్టేషన్ల మీదుగా కొల్లాం చేరుకుంటారు.
ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. ప్రత్యేకంగా వెళ్లే రైళ్లలో కర్పూరం, అగరబత్తీలు లాంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ వెలగించవద్దని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైళ్లలో మండే స్వభావం ఉండే వస్తువులను అస్సలు తీసుకెళ్లవద్దంటూ కోరింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని, అలాగే వెయ్యి రూపాయిలు జరిమానా విధిస్తామని రైల్వే శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ సూచనలను గుర్తించుకోవాలని సూచించింది. భక్తులు రైళ్లలో హరతి ఇవ్వడం లాంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదని, భక్తులు జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. అందరి భద్రతా దృష్ట్యా ఈ నిబంధనల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించింది. అలాగే, భక్తుల కోసం కేటాయించిన ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని సూచించింది.