బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి హాస్టల్‌లో భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థినులు వాంతులు, వికారం, కడుపు నొప్పితో అస్వస్థతకు గురికావడంతో వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చికిత్స అనంతరం కొందరు విద్యార్థినులు తిరిగి హాస్టల్‌కు వెళ్లగా, ఈ ఉదయం మళ్లీ పలువురికి వాంతులు, వికారం రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో మరోసారి విద్యార్థినులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆసుపత్రిలో వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తుండగా, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్‌కు గల అసలు కారణాలపై అధికారులు ఆరా తీస్తుండగా, హాస్టల్‌లో అందించిన ఆహార నమూనాలను పరీక్షలకు పంపే అవకాశం ఉంది. ఈ ఘటనతో పాఠశాల హాస్టల్‌లో కలకలం నెలకొంది