వాహన దొంగల ముఠా గుట్టురట్టు..!

ఆదిలాబాద్ జిల్లాలో వాహన దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నేరడిగొండ పోలీసులు రట్టు చేశారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో పలువురు వాహన చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠాలోని 16 మంది నిందితులపై కేసు నమోదు చేయగా. 10 మందిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.

వాహన దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా పట్టుకునేందుకు ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 21న ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఎదురుగా ఆటో దొంగిలించేందుకు ప్రయత్నించిన ఘటన తర్వాత పోలీసులు నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. జులై 24న కుప్టి ఘాట్ వద్ద వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పద కారును ఆపేందుకు ప్రయత్నించగా.. అందులోని నిందితులు ఏకంగా పోలీసులను బెదిరించి, కత్తి చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అనంతరం వాంకిడి చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అదే కారును అడ్డగించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాహన దొంగతనాల ముఠా గుట్టు బయటపడింది.

ప్రధాన నిందితులు యాసర్ అహ్మద్, సోహైల్ వాహన డ్రైవర్లుగా పనిచేస్తూ దొంగతనానికి అనువైన వాహనాలను గుర్తించి ముఠా సభ్యులకు సమాచారం అందించేవారని పోలీసులు తెలిపారు. ముఠా సభ్యులు అద్దె కారులో వెళ్లి పార్కింగ్‌లో ఉన్న వాహనాలను దొంగిలించి, వాటిని రిసీవర్లకు విక్రయించేవారని విచారణలో వెల్లడైంది. అరెస్టైన 10 మంది నిందితుల వద్ద నుంచి 7 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, ఒక కారు, 8 సెల్‌ఫోన్లు, ఒక కత్తి, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ.17 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మరో ఆరుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

జిల్లా పోలీసులు తొలిసారిగా ఈ ముఠాను గుర్తించి కేసును ఛేదించడం విశేషమని ఎస్పీ తెలిపారు. వాహన చోరీల నివారణలో ప్రజల సహకారం కూడా కీలకమని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయాలని. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. నంబర్ ప్లేట్ లేకుండా.. నంబర్ ప్లేట్‌లను ట్యాంపరింగ్ చేసి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like