కార్గిల్ వీరుల త్యాగాలు చిరస్మరణీయం
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఆదివారం ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొని కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమర జవాన్లకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ కార్గిల్ పోరాటంలో భారత సైనికులు ప్రదర్శించిన అపార శౌర్యం, అసమాన ధైర్యసాహసాలు, దేశం పట్ల వారి అచంచలమైన నిబద్ధత ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన కార్గిల్ అమర వీరులను ఎప్పటికీ మరువలేమని, వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, మాజీ సైనికులు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని కార్గిల్ అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.