రంగనాథ్ ను తొల‌గించండి…

తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. లోతుకుంట భూముల కేసు విచారణలో కోర్టు ధిక్కరణ అంశాలను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం.. అర్హత కలిగిన ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని సూచించింది.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంటలోని ప్రైవేటు భూముల వ్యవహారంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్న అధికారిని అదే పదవిలో కొనసాగించడం సమంజసం కాదని స్పష్టం చేసింది.

రంగనాథ్‌పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం.. ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో ఐజీ స్థాయి అర్హత కలిగిన అధికారిని నియమించాలని సూచించింది.

లోతుకుంట సర్వే నంబర్లు 1, 2 పరిధిలోని 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది వెళ్లలేదని.. అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని రంగనాథ్ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. కోర్టులు, న్యాయవ్యవస్థపై తనకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొంటూ బేషరతుగా క్షమాపణలు కూడా తెలిపారు.

అయితే రంగనాథ్ వివరణతో సంతృప్తి చెందని హైకోర్టు.. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఒక ఉన్నతాధికారి వరుసగా కోర్టు ధిక్కరణలకు పాల్పడడం రూల్ ఆఫ్ లాను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర పరిపాలనలో కీలక పరిణామంగా మారాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలపై ఎలా స్పందిస్తుంది..? కొత్త కమిషనర్‌గా ఎవరిని నియమిస్తుంది..? అన్నది ఆసక్తికరంగా మారింది.

You might also like