సింగరేణిపై వ‌ర్షం ప్ర‌భావం.. బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

-32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
-1.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత నిలిచివేత

Singareni:రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు సింగరేణి బెల్లంపల్లి రీజియన్‌లోని ఓపెన్‌కాస్ట్ గనుల కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్ (ఓబీ) వెలికితీత, బొగ్గు రవాణా కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి డివిజన్ల పరిధిలోని ఓపెన్‌కాస్ట్ గనుల్లో భారీగా నీరు నిల్వ ఉండటంతో డంపర్లు, ఎక్స్కవేటర్లు వంటి భారీ యంత్రాలు పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. గనుల లోపల రహదారులు బురదమయంగా మారడంతో యంత్రాల కదలిక పూర్తిగా నిలిచిపోయింది.

ఈ ప్రభావంతో ఒక్కరోజులోనే సుమారు 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే దాదాపు 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్‌బర్డెన్ (ఓబీ) వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. గనుల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించే పనులు వర్షాల తీవ్రత తగ్గిన తర్వాతే చేపట్టనున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు. పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన అనంతరం దశలవారీగా గనుల కార్యకలాపాలను పునఃప్రారంభించే అవకాశముందని పేర్కొన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో బెల్లంపల్లి రీజియన్‌లో బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, రవాణా కార్యకలాపాలు నిలిచిపోవడం సింగరేణి ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వర్షాలు తగ్గిన వెంటనే సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

You might also like