పెన్షన్ కోసం వెళ్లి.. వరదలో కొట్టుకుపోయిన మహిళ

నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు మరో విషాదాన్ని మిగిల్చాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నంలో ఓ మహిళ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఎరువచింతల్ గ్రామం వద్ద ఉన్న బల్లివాగు ఉప్పొంగి ప్రవహించింది. చామనపల్లి గూడెం గ్రామానికి చెందిన మర్సుకోల పారుబాయి (45) పెన్షన్ తీసుకునేందుకు వచ్చి, తిరిగి తన గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. అప్పటికే బల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, వాగు దాటే ప్రయత్నం చేసిన పారుబాయి వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.

స్థానికులు గమనించి వెంటనే ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత మహిళ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. ఈ ఘటనతో చామనపల్లి గూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయాలను కలిచివేశాయి. మృతురాలికి ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

భారీ వర్షాలతో వాగులు, వంకలు ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా ఇలాంటి విషాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

You might also like