బస్టాండ్‌లో భారీ గుంత.. తప్పిన పెను ప్రమాదం…
ఓ భారీ గుంత ఏర్పడింది… అది కూడా బస్టాండ్ కంట్రోలర్ గది ముందర… అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది… మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కొత్త బస్టాండ్‌లో భారీ గుంత ఏర్పడటం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం బస్టాండ్ మధ్యలో లోతైన గుంత ఏర్పడడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో అక్కడ ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
బెల్లంపల్లి కన్నాల బస్తీ సమీపంలోని కొత్త బస్టాండ్‌లో భారీ వర్షాల కారణంగా మధ్యభాగంలో లోతైన గుంత ఏర్పడింది. ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గు తవ్వకాలు జరిపింది. గతంలో నిర్వహించిన అండర్‌గ్రౌండ్ బొగ్గు గనుల తవ్వకాల ప్రభావంతోనే ఈ ఘటన జరిగి ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్టాండ్ నుంచి బెల్లంపల్లి నియోజకవర్గంలోని మండలాలతో పాటు మహారాష్ట్ర, హైదరాబాద్‌కు నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారు. అలాగే సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కూడా ఈ బస్టాండ్‌ను ఉపయోగిస్తుండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ సివిల్ విభాగం అధికారులు, రెవెన్యూ శాఖ, సబ్ కలెక్టర్ వెంటనే స్థలాన్ని పరిశీలించి గుంత ఏర్పడిన కారణాలపై నివేదిక సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బెల్లంపల్లి ప్రాంతంలో పలు అండర్‌గ్రౌండ్ గనులు ఒకదానికొకటి అనుసంధానమై ఉండటంతో, మూసివేసిన గనుల పరిసరాల్లో సింగరేణి యాజమాన్యం డీజీఎంఎస్ మార్గదర్శకాల ప్రకారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేయాల్సిన బాధ్యత ఉందని స్థానికులు గుర్తు చేస్తున్నారు.
అవసరమైతే సింగరేణికి చెందిన ఖాళీ భవనాలు లేదా ఇతర ప్రాంగణాల్లో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్థానిక ఎమ్మెల్యే వెంటనే ఘటనాస్థలిని సందర్శించి తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. మణిరాం సింగ్, పట్టణ ఉపాధ్యక్షుడు గజ్జల దుర్గయ్య, ఆర్. హరిబాబు, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకుడు పోచమల్లు తదితరులు హెచ్చరించారు.