ఎమ్మెల్యే వినోద్‌కు కాంగ్రెస్ సీనియర్ల అల్టిమేటం
బెల్లంపల్లి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. నెన్నెల మండలంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమావేశమై ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు పార్టీలో చేరిన నాయకులే ఇప్పుడు మండలాన్ని శాసిస్తున్నారని, అసలు కాంగ్రెస్ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన తమను పూర్తిగా పక్కన పెట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిని వెంటనే చక్కదిద్దకపోతే తామే తమ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు బెల్లంపల్లి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం విడుదల చేసిన వీడియోలో ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులే ప్రస్తుతం మండలంలో అన్నీ తామేనన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసలు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కనిపించడం లేదని, ఆ నాయకులే ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ బోర్‌వెల్స్, రోడ్లు సహా అన్ని పనులు తామే చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
కొత్తగా ఎన్నికైన అమాయక సర్పంచ్‌లను కూడా ఎంపీ ఫండ్ పది లక్షలు, ఎమ్మెల్యే ఫండ్ పది లక్షలు, డీఎంఎఫ్టీ పదిహేను లక్షలు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో వ్యక్తికి కోటి రూపాయల వరకు నిధులు ఇప్పిస్తామని చెబుతున్నారని అన్నారు. గొల్లపల్లి ప్రాంతంలో రైతులు చేసిన ధర్నాను ప్రస్తావించిన నాయకులు… రైతులకు ప్రభుత్వంపై గానీ, ఎమ్మెల్యే వినోద్‌పై గానీ కోపం లేదని, ఆయన చుట్టూ ఉన్న కొందరు నాయకుల వ్యవహార శైలిపైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే వినోద్ వారిని నమ్ము తాను గెలుస్తా అనుకుంటున్నారని కానీ వినోద్ సార్ వారిని నమ్మకండి.. మిమ్మల్ని ముంచేది వారేనంటూ హెచ్చరించారు. ఇప్పటికే పలువురు పీఏలు ఉండగా, మీ అల్లుడు రమేష్ సైతం వాళ్లతో కలిసిపోయాడని స్పష్టం చేశారు. తోట శ్రీనివాస్‌కు రెండు పదవులు, హరీష్ గౌడ్‌కు రెండు పదవులు ఇస్తామని కుమ్మక్కు అయ్యారు దుయ్యబట్టారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేసిన సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యత్వం కూడా లేని నాయకులను తీసుకొచ్చి తమపై పెత్తనం చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఈ పరిస్థితిపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే తామే తమ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్చరించారు.ఈ సమావేశంలో మైలారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గురునాథం మల్లగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గట్టు మల్లేష్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు సుంకరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలేటి సంధ్యతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇప్పటికే కలహాల కాపురంతో ముందుకు సాగుతున్న బెల్లంపల్లి కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుల అసంతృప్తి బహిరంగంగా బయటపడటం స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి..