అక్రమంగా గడ్డి మందు తరలింపు.. నలుగురు అరెస్ట్

మహారాష్ట్ర నుంచి గడ్డి మందులను అక్రమంగా తెలంగాణలోకి తరలించి రైతులకు విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను భీమిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.1.44 లక్షల విలువైన గడ్డి మందులు, ఒక టొయోటా ఇన్నోవా కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తాండూర్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఎ. భాస్కర్ ఈ వివరాలను వెల్లడించారు.

 పోలీసుల కథనం ప్రకారం, రాంపూర్ గ్రామ శివారులోని ఎక్స్‌రోడ్ వద్ద టొయోటా ఇన్నోవా కారు (AP15AV 4488), అలాగే వెంకటాపూర్ గ్రామ పరిసరాల్లో ద్విచక్ర వాహనాల్లో గడ్డి మందులను అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో భీమిని ఎస్సై కోటేశ్వర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడ్డి మందు క్యాన్లు, ప్యాకెట్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నిందితులు మహారాష్ట్రలోని రాజురా పట్టణం నుంచి గడ్డి మందును కొనుగోలు చేసి భీమిని మండల పరిధిలో రైతులకు అక్రమంగా విక్రయించేందుకు తీసుకొస్తున్నట్లు అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు.

భీమిని పోలీస్ స్టేషన్‌లో నమోదైన రెండు కేసుల్లో మొత్తం 290 లీటర్ల గడ్డి మందు, 10 టాపర్-77 ప్యాకెట్లు, ఒక టొయోటా ఇన్నోవా కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గడ్డి మందుల మొత్తం విలువ రూ.1,44,100గా పోలీసులు అంచనా వేశారు.

ఈ సందర్భంగా డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడుతూ, గ్లైఫోసేట్ వంటి గడ్డి మందుల అధిక వినియోగం వల్ల భూమి సారవంతం తగ్గడంతో పాటు పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణానికి హాని కలగడంతో పాటు రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు.

రైతులు ప్రభుత్వం అనుమతించిన, లైసెన్సు కలిగిన ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతులు లేకుండా గడ్డి మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డీసీపీ తెలిపారు.

ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ బి. శ్రీనివాస్ రావు, తాండూర్ సీఐ దేవయ్య, భీమిని ఎస్సై కోటేశ్వర్, టాస్క్‌ఫోర్స్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

You might also like