ఆదివాసుల ఆందోళన.. ఉద్రిక్తత
జన్నారం మండలంలోని ఇంధన్పల్లి అటవీ రేంజ్ కార్యాలయం ఎదుట ఆదివాసీలు ఆదివారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. చేపల వేటకు వెళ్లిన ఐదుగురు ఆదివాసులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంఘీభావం ప్రకటించి, ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ, అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు ఆదివాసులను వెంటనే విడుదల చేసే వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ఆదివాసీలను వేధించడం మానుకోవాలని అటవీ శాఖ అధికారులను హెచ్చరించారు.
అటవీ శాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, పంటలు సాగు చేసుకోనివ్వకుండా అడ్డుకోవడం, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో ప్రభుత్వం ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇటీవల మంత్రుల పర్యటన రోజున కూడా ఆదివాసుల ట్రాక్టర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.
ఇంధన్పల్లి ఎఫ్డీపీటీ శాంతారామ్తో పాటు ఉడుంపూర్, కడెం, ఖానాపూర్, జన్నారం ప్రాంతాల ఎఫ్ఆర్వోలను వెంటనే బదిలీ చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇప్పటికే తనపై 52 కేసులు ఉన్నాయని, వంద కేసులు పెట్టినా భయపడేది లేదని, ఆదివాసుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.