సీసీ రోడ్ల వివాదం.. సర్పంచ్ భర్తపై దాడి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యతపై వివాదం నెలకొంది. గ్రామస్తుల ఫిర్యాదుతో పనులను పరిశీలించిన సమయంలో చోటుచేసుకున్న ఘర్షణ ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో పాటు, ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం సాగ్వి గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు నాణ్యతగా లేవని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్, ఆమె భర్త బాపూరావు, పంచాయతీ కార్యదర్శి కలిసి రోడ్డు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లింబారావు… సర్పంచ్ భర్త బాపూరావుపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం విచారణకు వచ్చిన ఎంపీఓ… రోడ్డు బిల్లులు చెల్లించకపోతే చెక్ పవర్ రద్దు చేస్తామని ఒత్తిడి తెచ్చి, సర్పంచ్‌తో రెండు చెక్కులపై సంతకాలు చేయించి రెండు బిల్లులు మంజూరు చేయించినట్లు సర్పంచ్ ఆరోపించారు.
బాపూరావుపై కాంట్రాక్టర్ దాడి చేసినట్లు చెబుతున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయినా ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.దాడి ఆరోపణలు, బిల్లుల చెల్లింపులపై ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యం ఆరోపణలు… రాంపూర్‌లో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.