బోనాలపై ట్రోలింగ్‌..

అద్భుత‌మైన జ‌వాబు ఇచ్చిన ఫ‌రియా అబ్దుల్లా

మనసులో ద్వేషాన్ని నింపుకుని దేవుడిని వెతకడం సరైన మార్గం కాదు… అంతటి విశాలమైన దైవ భావనను సంకుచిత ఆలోచనలతో ఎందుకు బంధిస్తున్నారు…. సినీ న‌టి ఫ‌రియా అబ్ధుల్లా

హైదరాబాద్ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న టాలీవుడ్ కథానాయిక ఫరియా అబ్దుల్లాపై కొంద‌రు మ‌త‌ప‌రంగా విమ‌ర్శిస్తూ పోస్టులు పెట్టారు. ముస్లిం కుటుంబంలో పుట్టి హిందూ సంప్రదాయ వేడుకలో పాల్గొందంటూ కొందరు ఆమెను ‘కాఫిర్’ అంటూ ట్రోల్ చేశారు. ఈ విమర్శలపై ఫరియా కన్నీళ్లు పెట్టుకుంటూ తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. “ద్వేషానికి ప్రేమతోనే సమాధానం ఇస్తా”నంటూ ఆమె ఓ వీడియో విడుదల చేశారు.

‘జాతిరత్నాలు’ సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటి ఫరియా అబ్దుల్లా.. ఇటీవల పాతబస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో సందడి చేశారు. స్థానిక మహిళలతో కలిసి భక్తిశ్రద్ధలతో బోనం ఎత్తి, పోతురాజులతో కలిసి స్టెప్పులేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అయితే, ఆమె బోనాల్లో పాల్గొనడాన్ని తప్పుబట్టారు. కొందరు ఆమెను ‘కాఫిర్’ అంటూ సంబోధించ‌డంతో పాటు తీవ్రంగా విమ‌ర్శించారు.

ఈ ట్రోలింగ్‌పై ఫరియా ఓ సెల్ఫీ వీడియో ద్వారా స్పందిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ.. తన తండ్రి ఇస్లాం సిద్ధాంతాలను నమ్మి మతం మారారని, అందులోని మంచిని మాత్రమే తనకు నేర్పించారని తెలిపారు. “అల్లా అన్నింటా ఉంటారు.. ప్రకృతిలోని చెట్టు, రాయి, సీతాకోకచిలుక ఇలా ప్రతి జీవంలోనూ ఒక దివ్యత్వం ఉంది. దేవుడు ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదు. ప్రతి చోటా విస్తరించి ఉండే వెలుగే భగవంతుడు.”

తనపై ద్వేషం చిమ్మేవారికి సైతం తాను ప్రేమనే పంచుతానని, వారి మంచిని కోరుకుంటానని ఫరియా స్పష్టం చేశారు. మనసులో ద్వేషాన్ని నింపుకుని దేవుడిని వెతకడం సరైన మార్గం కాదని హితవు పలికారు. అంతటి విశాలమైన దైవ భావనను సంకుచిత ఆలోచనలతో ఎందుకు బంధిస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఫరియా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, ఆమె భావాలకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

You might also like