రేపు రాష్ట్రవ్యాప్త నిర‌స‌న‌ల‌కు బీఆర్ఎస్ పిలుపు

కాంగ్రెస్ ప్ర‌భుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం రద్దు కుట్ర చేస్తోంద‌ని బీఆర్‌ఎస్‌ పార్టీ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టనుంది. ఈ ప‌థ‌కాల ర‌ద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆందోళనలకు పిలుపునిచ్చారు.

కొద్ది రోజుల కింద‌ట కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ పథకంపై హైకోర్టు స్టే విధించిన విష‌యం తెలిసిందే. ఈ ప‌థ‌కాల కింద గ‌త ప్ర‌భుత్వం ఇచ్చే ల‌క్ష రూపాయ‌ల‌తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అది ఇవ్వకుండా ఏకంగా ఆ పథకాన్ని ఏకంగా రద్దు చేస్తున్నార‌ని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాల రద్దు చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జనరల్ బాడీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రేపు నిర్వహించాల్సిన ఆందోళనలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

హైకోర్టు తీర్పు సాకుతో పేదింటి ఆడబిడ్డల భరోసాను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఆడబిడ్డలు తులం బంగారం అడుగుతున్నందుకే పూర్తిగా కల్యాణ లక్ష్మిని ఎత్తగొట్టే కుట్ర అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ కుట్రను అడ్డుకోవడంతోపాటు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలు అని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఆడబిడ్డ పెళ్లి ఆర్థిక భారంగా గుర్తించిన కేసీఆర్ 2014 అక్టోబర్ 2న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. రూ.51 వేల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచారని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందని.. కరోనా వంటి సమయంలోనూ పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తుచేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లిళ్లు జరిగి చాలా కాలం గడిచినా.. కొందరికి పిల్లలు పుట్టినా కూడా తమకు రావాల్సిన కల్యాణలక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌కు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న అన్ని అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

You might also like