ఆ టిక్కెట్టు ధర అక్షరాల రూ. కోటి
అవును మీరు విన్నది నిజమే… తిరుమల తిరుపతిలో ఒక టిక్కెట్టుకు అక్షరాల కోటి రూపాయలు. శ్రీవారి సేవ కోసం ఎందరో భక్తులు బారులు తీరుతారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే అన్ని సేవల్లో పాల్గొనే భాగ్యం కల్పించింది టీటీడీ. దానినే ఉదయాస్తమాన సేవ అంటారు. శ్రీవారి ఉదయాస్తమాన సేవల టికెట్ ధర నిర్ణయించింది టీటీడీ. సాధారణ రోజుల్లో కోటి, శుక్రవారం రోజున కోటిన్నరగా ధర నిర్ణయించింది. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అన్నిసేవల్లో పాల్గొనే అవకాశం ఉదయాస్తమాన సేవ ద్వారా టీటీడీ అందిస్తోంది. భక్తులు ఎంచుకున్న తేదీలో 6 మందితో సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఈ విరాళాల మొత్తంతో చిన్నారుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించనుంది. మొత్తం 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. ఈ టికెట్ల మంజూరుతో టీటీడీకి 6వందల కోట్ల ఆదాయం సమకూరనుంది. 2022 జనవరి రెండో వారం నుంచి టికెట్ల కేటాయింపునకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుండగా ఈ నెల 23న ట్రయల్ రన్ నిర్వహించనుంది.