రేఖానాయ‌క్‌పై కేసు నమోదు

రూ.40.96 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయం

ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ పై ధాన్యం ఎగవేత పై కేసు నమోదు అయింది.. తన పేరిట ఉన్న రైస్ మిల్లులో రూ.40.96 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం కుంభ కోణంలో ఆమె పై ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెన్‌పల్లిలోని ఓ రైస్ మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం మాయమైన ఘటన బయటపడింది. మూడు రబీ సీజన్లకు సంబంధించి మొత్తం 9,639.962 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం అందుబాటులో లేకపోవడంతో.. దాని విలువను సుమారు రూ.40.96 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో సత్తెన్‌పల్లిలోని *M/s ARS Industries (మిల్ కోడ్ 175825)కు రబీ 2022-23, 2023-24, 2024-25 సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ కోసం ప్రభుత్వ ధాన్యం కేటాయించారు. ఒప్పందం ప్రకారం మిల్లింగ్ చేసిన బియ్యాన్ని (CMR) ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 18న ఖానాపూర్ డీటీ (ఎన్‌ఫోర్స్‌మెంట్) ఆధ్వర్యంలో మిల్లులోని రికార్డులు, స్టాక్, గోదాములను సమక్షంలో తనిఖీ చేశారు. తనిఖీల్లో రికార్డుల ప్రకారం ఉండాల్సిన ప్రభుత్వ ధాన్యం, అందజేయాల్సిన CMR బియ్యం భారీగా కొరత ఉన్నట్లు గుర్తించారు.

రబీ 2022-23లో 6,821.640 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా, 4,638.715 మెట్రిక్ టన్నుల CMR అందజేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 831.071 మెట్రిక్ టన్నుల CMR మాత్రమే అందజేశారు. 116.541 మెట్రిక్ టన్నుల వేలం ధాన్యం తరలించారు. దీంతో 5,482.936 మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉండాల్సి ఉండగా, తనిఖీల్లో మిల్లులో ధాన్యం.. బియ్యం ఏదీ కనిపించలేదు.

రబీ 2023-24లో 7,430.840 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా, 5,052.971 మెట్రిక్ టన్నుల CMR ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 3,205.269 మెట్రిక్ టన్నుల CMR మాత్రమే అందజేశారు. దీంతో 2,717.209 మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉండాల్సి ఉండగా, తనిఖీల్లో ధాన్యం, బియ్యం లభించలేదు.

రబీ 2024-25లో 2,413.640 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా, 1,641.275 మెట్రిక్ టన్నుల CMR ఇవ్వాల్సి ఉంది. అయితే 343.200 మెట్రిక్ టన్నుల CMR మాత్రమే అందించారు. 1,908.934 మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉండాల్సి ఉండగా, తనిఖీల్లో 469.117 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే లభించింది. బియ్యం మాత్రం అందుబాటులో లేదు.

మూడు సీజన్లకు సంబంధించి మొత్తం 9,639.962 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ధాన్యం విలువను వర్తించే కనీస మద్దతు ధర (MSP) ప్రకారం రూ.40,96,96,834గా అంచనా వేశారు.

ప్రభుత్వానికి అప్పగించిన ధాన్యం, CMRను లెక్కల్లో చూపకుండా మళ్లించడం, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేయడం ద్వారా భారీ ఆర్థిక నష్టం కలిగించారని ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.. ఈ ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నంబర్ 165/2026 కింద ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You might also like