ఓ విప్లవ ప్రస్థానం ముగిసింది…
రాధక్క కన్నుమూత
ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, మావోయిస్టు ఉద్యమ చరిత్రలో పరిచయం ఉన్న పేరు.. కోర్సింగే మోతీబాయి అలియాస్ రాధక్క…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గిరిజన ప్రాంతానికి చెందిన రాధక్క.. తొలి తరం మహిళా మావోయిస్టు నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. మావోయిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆమె.. నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ పరిధితో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ బస్తర్ డివిజన్ పరిధిలో డివిజనల్ కమిటీ సభ్యురాలిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు.
రాధక్క మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం…
రాధక్క 1984లో అప్పటి పీపుల్స్ వార్ లో చేరారు. సిర్పూర్ దళంలో సభ్యురాలుగా పనిచేస్తు 1986లో పార్టీ సభ్యురాలయ్యారు.1989లో ఏరియా కమిటీ సభ్యురాలుగా ఆమెను ప్రమోట్ చేశారు. 2000 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యురాలిగా నియమించారు. 2003లో ఆమను దండకారణ్యం బదిలీ చేశారు. అక్కడ క్రాంతి కారి ఆదివాసీ మహిళ సంఘానికి నాయకత్వం వహించింది. ఈ క్రమంలోనే ఆమెను ఎప్పటినుంచో వేధిస్తున్న గుండె సమస్య తీవ్రమైంది. చికిత్స కోసం డీకే నుంచి హాస్పిటల్ వెళ్లే క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోలీసులు అరెస్టు చేశారు. 2013 నుండి 2016 వరకు జైలు జీవితం గడపగా, 2016లో విడుదలయ్యింది.
రిమ్స్‌లో చికిత్స పొందుతూ..
ఆమె ఉద్యమంలో దాదాపు 28 సంవత్సరాలు అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం రాధక్క తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 65 సంవత్సరాలు. ఆమె మృతదేహానికి మంగళవారం మధ్యాహ్నం పిప్పల్దరి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాధక్క మృతితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాసంఘాల నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.