అమ్మ పరుగు… బిడ్డ భవిష్యత్‌ వెలుగు!

ఆమె ప‌రిగెడుతోంది… రాళ్లు గుచ్చుకుంటున్నాయి… చెప్పులు జారి పోయాయి… చీర అడ్డు వ‌స్తోంది.. అయినా ఆమె అడుగు ఆగ‌లేదు.. ఒక‌టే ఆశ‌, అదే ధ్యాస‌.. త‌ను గెల‌వాలి… త‌న గెలిస్తే కూతురు చ‌దువుకుంటుంద‌ని…

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగైకి చెందిన 47 ఏళ్ల రామాబాయి రణ్వీర్ కథ ఇది. పిల్లల చదువు కోసం తల్లి ఎంతటి కష్టాన్నైనా భరించగలదని ఆమె మరోసారి నిరూపించారు. అంబాజోగైలోని ఖోలేశ్వర్ విద్యా సముదాయంలో అమృత మహోత్సవ వేడుకల్లో భాగంగా ‘అమృత్ దౌడ్’ మారథాన్ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ పరుగు భాగ్యనగర్ చౌక్ వద్ద ముగిసింది. స్థానిక యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ పోటీలో రామాబాయి కూడా సాధారణ చీర, చెప్పులతో పోటీదారుగా నిలిచారు.

రేసు మొదలైంది…. మిగతా పోటీదారులు బూట్లు, ట్రాక్‌సూట్లు ధరించి వేగంగా పరుగులు తీశారు. రామాబాయి కూడా తన శక్తినంతా కూడగట్టుకుని వారి వెంట పరుగెత్తారు. కొంతదూరం వెళ్లగానే ఆమె చెప్పులు జారిపోయాయి.

అక్కడే ఆగిపోవచ్చు.
‘నా వల్ల కాదు’ అని వెనక్కి తగ్గిపోవచ్చు.
కానీ ఆమె అలా చేయలేదు.

చెప్పులను చేతిలోకి తీసుకున్నారు. ఇక కాళ్లకు చెప్పులు లేకుండానే పరుగును కొనసాగించారు. ముందున్న రోడ్డుపై రాళ్లు ఉన్నాయి. కాళ్లు నొప్పులు పుడుతున్నాయి… త‌న చీరను సర్దుకుంటూ పరుగెత్తాల్సి వచ్చింది. అయినా ఆమె చూపు మాత్రం ఒక్కటిపైనే ఉంది…

ముగింపు రేఖపై….

ఎందుకంటే ఆ రేసులో ఆమె గెలవాల్సింది కేవలం ఒక బహుమతి కోసం కాదు. తన కూతురి చదువు కోసం… ఆమె ప్రతి అడుగులోనూ ఓ తల్లి ఆశ ఉంది. ప్రతి నొప్పిలోనూ ఓ బిడ్డ భవిష్యత్తు ఉంది. అందుకే కాళ్లకు చెప్పులు లేకపోయినా… మనసులోని పట్టుదల మాత్రం ఆమెను ముందుకు నడిపించింది. చివరికి యువ పోటీదారులను వెనక్కి నెట్టి అందరికంటే ముందుగా ముగింపు రేఖను దాటారు రామాబాయి.

విజేతగా నిలిచిన ఆమెకు రూ.3,000 నగదు బహుమతి లభించింది… ఆ బహుమతిని ఏం చేసుకోవాలనుకుంటున్నారని అడిగితే ఆమె చెప్పిన మాటే అందరి కళ్లను చెమ్మగిల్లేలా చేసింది…

“నా కూతురి చదువు కోసం ఉపయోగిస్తాను.”

ఆమె చేతిలో ఉన్నది రూ.3,000 మాత్రమే కావచ్చు. కానీ ఆ డబ్బు వెనుక ఓ తల్లి చెమట ఉంది. కాళ్ల నొప్పి ఉంది. కన్నీటి చుక్కలు ఉన్నాయి. అంతకుమించి… తన బిడ్డ మంచి భవిష్యత్తు చూడాలనే ఒక తల్లి కల ఉంది… రామాబాయి గెలిచింది మారథాన్‌లో మాత్రమే కాదు… తల్లి ప్రేమకు, త్యాగానికి, పట్టుదలకు కూడా విజయం కట్టబెట్టారు. ఆమె పరుగును చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యారు. చప్పట్లతో ఆమెను అభినందించారు.

నిజమే, అమ్మ ప్రేమకు అసాధ్యమైనది ఏదీ లేదు. రామాబాయి ప్రతి అడుగు ఎందరో తల్లుల ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపింది. గెలవాలన్న కసి, బిడ్డపై ప్రేమ ఉంటే వయసు, పేదరికం ఏవీ అడ్డురావని చాటిచెప్పింది. ఈ పరుగు కేవలం ఆమె కూతురికే కాదు, ఏ చిన్న కష్టానికో కుంగిపోయే నేటి సమాజానికి ఒక కొత్త దారిని, ధైర్యాన్ని చూపించింది. బిడ్డ మంచి భవిష్యత్తు కోసం అలుపెరగకుండా పరుగెత్తిన ఆ తల్లి పాదాలకు, ఆమె పట్టుదలకు ప్రతి ఒక్కరూ సలాం చేయాల్సిందే.

 

You might also like