ప్ర‌జ‌ల గొంతుకై పోరాటం చేస్తాం

తాము ప్ర‌జ‌ల గొంతుకై నిల‌బ‌డి పోరాటం చేస్తామ‌ని మంచిర్యాల బీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అంబేద్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు భారీ ప్లెక్సీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పాల్గొని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని బాల్క సుమన్‌ ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు ‘కాంగ్రెస్‌ బాకీ కార్డులు’ పంపిణీ చేస్తున్నామ‌న్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సుమ‌న్ వెల్ల‌డించారు.

పేదల ఇళ్ల కూల్చివేతలపై ఆరోపణలు
హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపడుతుంటే.. చెన్నూరులో మంత్రి వివేక్‌ వెంకటస్వామి రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని బాల్క సుమన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పేదలపై కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో మంజూరై, ప్రారంభమైన అభివృద్ధి పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపివేసిందని విమర్శించారు. నిలిచిపోయిన పనులన్నింటినీ తక్షణమే పునఃప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఇసుక మాఫియాపై సంచలన ఆరోపణలు
చెన్నూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందా దర్జాగా కొనసాగుతోందని బాల్క సుమన్‌ ఆరోపించారు. ఈ అక్రమ ఇసుక మాఫియా మంత్రి పీఏ రమణారావు కనుసన్నల్లోనే కొనసాగుతోందని సంచలన ఆరోపణ చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా బీఆర్ఎస్‌ వెనక్కి తగ్గబోదని బాల్క సుమన్‌ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని, కాంగ్రెస్‌ ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ ప్రజల గొంతుకగా నిరంతరం పనిచేస్తామని ఆయన పిలుపునిచ్చారు.

You might also like