ఏం చేద్దాం…?
బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కార్మిక సంఘాల మల్లగుల్లాలు
బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణ ఆగిపోయిందని, తాము సమ్మె చేస్తే కేంద్రం భయపడి వెనక్కి తగ్గిందని కార్మిక సంఘాలు ప్రకటించుకుంటున్నాయి. కానీ కేంద్రం మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ఆగిన బొగ్గు బ్లాక్ లను వేలం వేసేందుకు తిరిగి సన్నాహాలు చేస్తోంది. నాలుగో విడత వేలానికి నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు కార్మిక సంఘ నేతలు ఏం చేస్తారు..? మళ్లీ కేంద్రంపై యుద్ధానికి సిద్ధం అవుతారా..? లేక రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉంది కనుక వేరే ఏదైనా ప్రణాళిక రూపొందిస్తారా…? సింగరేణి బొగ్గు బ్లాక్ ల వేలంలో పాల్గొనేలా కార్యాచరణ తయారు చేస్తారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఆ సంస్థపై కత్తివేలాడుతూనే ఉంది. కేంద్రం నాలుగో విడత బొగ్గు వేలానికి నిర్ణయం తీసుకుంది. మొత్తం 99 బ్లాక్‌ల వేలానికి సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఝార్ఖండ్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్రతో పాటు తెలంగాణలో ఉన్న 99 బొగ్గు బ్లాక్‌లను వేలం వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో వేలం వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నా నాలిగింట్లో మూడింటికి టెండర్ రాలేదు. ఒకదానికి మాత్రం టెండర్ వచ్చింది. కేవలం సింగిల్ టెండర్ రావడంతో సింగరేణి కార్మికులు ఊపిరి పీల్చుకుననారు. మళ్లీ సింగరేణి తాజా నిర్ణయంతో మళ్లీ ఆందోళన కొనసాగుతోంది.
అయితే ఈ తప్పిదానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థనే ప్రధాన కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. కేంద్రం కొన్ని రాష్ట్రల్లో ఆయా రాష్ట్రలకు బొగ్గు బ్లాక్‌లను కేటాయించింది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ఈ బొగ్గు బ్లాక్‌లను ఇచ్చింది. ఆయా రాష్ట్రప్రభుత్వాలు కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన తర్వాత వాటిని కేటాయించారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఆ విషయంపై దృష్టి సారించలేదని పలువురు ఎండగడుతున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు సంస్థ సీఅండ్ఎండీ కూడా దానిపై కనీసం పట్టించుకోలేదని కార్మికులు, కార్మిక సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రికి చెప్పి, కేంద్రంతో ఒప్పించాల్సిన ప్రధాన పాత్ర పోషించాల్సిన సీఅండ్ఎండీ దాని గురించి కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు దాని పర్యావసానాలు అనుభవించాల్సి వస్తోంది.
కొద్ది రోజుల కిందట తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో సహా ఐదు జాతీయ కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో సమ్మెకి దిగాయి. మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చి విజయవంతం చేశాయి. బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణ జరగాలంటే ఖచ్చితంగా సమ్మె చేయాల్సిందేనని కార్మికులను సైతం నమ్మించాయి. దీంతో కార్మికులు సైతం నిజమే అనుకుని సమ్మెలోకి వెళ్లారు. జాతీయ కార్మిక సంఘాలు సైతం గుడ్డిగా సమ్మెలోకి వెళ్లాయి. సమ్మె చేయకుంటే తాము కార్మిక ద్రోహులుగా మిగలాల్సి వస్తుందని బీఎంఎస్ సైతం సమ్మెలో పాల్గొంది. దీంతో కార్మిక సంఘ నేతలు చంకలు గుద్దుకున్నారు. తాము అనుకున్న విధంగా సమ్మె విజయవంతం అయ్యిందని భావించారు. అటు బొగ్గు బ్లాక్‌ల వేలానికి సంబంధించి కంపెనీలు ఏవీ ముందుకు రాకపోవడంతో వేలం ప్రక్రియ నిలిచిపోయింది. తాము సమ్మె చేయబట్టే ఎవరూ ముందుకు రాలేదని కార్మిక సంఘ నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
ఇక్కడి వరకు కథ సుఖాంతం అయినట్లు కనిపించినా అసలు కథ ముందుంది. ఎందుకంటే బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పుడే కార్మిక సంఘాలు అసలు పోరాటం చేయాల్సి ఉంది. ఇందులో మొదటిది బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ మోదీ చేస్తున్నాడని మళ్లీ సమ్మెకు వెళ్లడం. దీనివల్ల ఏం ఉపయోగం ఉండదని అర్దం అయ్యింది. ఇతర రాష్ట్రల్లో అక్కడి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే తాము బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులు చేశామని సాక్షాత్తు కేంద్రమంత్రి ప్రకటించారు. ఇక రెండోది రాష్ట్ర ప్రభుత్వం తరఫున గానీ సింగరేణి సంస్థ తరఫున కానీ ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఒక బృందాన్ని పంపించి బొగ్గు బ్లాక్‌లు సింగరేణికి కేటాయించేలా చూడటం. ఇప్పుడు కార్మిక సంఘ నేతలు అదే ఆలోచనలో ఉన్నారు. తమ పోరాటం ఎటు వైపు… ఏం చేద్దాం అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. మరి కార్మిక సంఘ నేతలు ఏం చేస్తారో…? తమ పోరాటం ఎటు వైపు మళ్లిస్తారో చూడాలి.