సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర గొప్పది

ఆదిలాబాద్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన గురుమహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషా సతీష్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్‌ బండారి అనుషా సతీష్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు చూపిన మార్గం, అందించిన విద్య, విలువలు ఎప్పటికీ మరువరాదని పేర్కొన్నారు. ఎస్పీ అయినా, కలెక్టర్ అయినా, ఎంపీ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఒకప్పుడు గురువు వద్ద విద్యను అభ్యసించిన శిష్యుడేనని గుర్తుంచుకోవాలని సూచించారు.

గురువులకు సమాజంలో తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలని, గురువులను గౌరవించడం ద్వారా మన సమాజాన్ని, మన విలువలను గౌరవించుకున్నట్లవుతుందని అన్నారు. అదేవిధంగా పెద్దలను గౌరవించడం, వారి అనుభవాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.గురువులు కేవలం విద్యను మాత్రమే కాకుండా మంచి విలువలు, క్రమశిక్షణ, నైతికతను విద్యార్థులకు అందిస్తూ భవిష్యత్ సమాజాన్ని తీర్చిదిద్దుతున్నారని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులు, జిల్లా నాయకులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

You might also like