సింగరేణి సహకారం అద్భుతం..
కర్ణాటక విద్యుత్తుకు సింగరేణి సహకారంపై సంతృప్తి - కర్ణాటక పవర్ కార్పోరేషన్ ఎం.డి., కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి పొన్నురాజు
సింగరేణి బొగ్గుతో కర్ణాటకలో ప్రసుత్తం మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు సజావుగా నడుస్తున్నాయి. సింగరేణి సహకారం అద్భుతమ’ని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి, కర్ణాటక పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (కె.పి.సి.ఎల్.) ఎం.డి. వి.పొన్నురాజు సింగరేణిపై ప్రశంసలు కురిపించారు. సోమవారం హైద్రాబాద్ పర్యటనలో భాగంగా ఆయన సింగరేణి భవన్ లో డైరెక్టర్ (పా, ఫైనాన్స్, పి&పి) బలరామ్ ను కలిశారు. ఈ సందర్భంగా పొన్నురాజు మాట్లాడుతూ కర్ణాటక లోని రాయచూర్, యరమారస్, బెళ్లారిలోని 3 థర్మల్ ప్లాంటులకు కావాల్సి ఉన్న 10 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఎటువంటి అంతరాయం లేకుండా అందిస్తోందన్నారు. ఇది చాలా సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. అందుకే కర్ణాటకలో ఎటువంటి కొరత లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. సింగరేణి సహకారానికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. వీలుంటే రోజువారి బొగ్గుసరఫరాను సాధ్యమైనంత పెంచాలని ఆయన కోరారు. దీనిపై డైరెక్టర్ (పి&పి, ఫైనాన్స్, పర్సనల్) బలరామ్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర విద్యుత్తు అవసరాలు తీర్చడంలో సింగరేణి కీలకపాత్ర పోషించడం ఎంతో సంతోషకరమన్నారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు రోజువారీ బొగ్గు సరఫరాను కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్ పాల్గొన్నారు.