ఆలస్యంగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
మధ్యాహ్నం 2 గంటలకల్లా నిమజ్జనం!
ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఈసారి ఆలస్యంగా ప్రారంభమైంది. బాహుబలి క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు మూడు గంటలు ఆలస్యంగా గణేషుడు టస్కర్‌పైకి చేరాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర, క్రేన్‌లో సమస్య కారణంగా 3 గంటల ఆలస్యంగా 9 గంటలకు ప్రారంభమైంది. మరోవైపు స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శోభాయాత్ర ఆలస్యం అవుతుండటంతో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది.
69 అడుగుల ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాట్లు చేశారు. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణతల్లి చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి అవుతుందని అధికారులు భావిస్తున్నారు. క్రేన్ నంబర్ 5 వద్ద మహా గణపతి నిమజ్జనం కానుంది.