రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో మూడు కాంస్య పతకాలు
హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిభ కనబరిచి మూడు కాంస్య పతకాలను సాధించారు.
గెజిటెడ్ అధికారుల విభాగంలో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించారు. నాన్ గెజిటెడ్ అధికారుల డబుల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో జిల్లా పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు జాదవ్ కిషోర్, కె దేవ్ రావ్ జంట మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించారు.
రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తి ప్రతిష్టలను పెంపొందించిన ముగ్గురు విజేతలnను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విజేతలకు ప్రశంసాపత్రాలు, మెడల్స్ అందజేసి అభినందనలు తెలిపారు.
రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయస్థాయి పోలీస్ క్రీడల్లో కూడా ప్రతిభ కనబరుస్తూ ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎస్పీ సూచించారు. భవిష్యత్తులో మరింత కష్టపడి సాధన చేస్తూ మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీసీ కొండరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.