మేడారం భక్తులకు ఉచితంగా ప్రసాదం
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగే జాతరలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేయాలని నిర్ణయిచింది. జాతరలో మొక్కులు చెల్లించిన భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఈసారి ప్రసాదం, పసుపు, కుంకుమలను పంపిణీ చేయాలనుకుంటున్నట్లు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తెలిపారు. అమ్మవార్లకు భక్తులు మొక్కుగా గద్దెలపై సమర్పించే బంగారం(బెల్లం), పసుపు, కుంకుమలను భక్తులు ఇంటికి తీసుకెళ్తారు. రద్దీలో కొద్ది మందికే ఇది సాధ్యమవుతోంది. ప్రసాదం కోసం భక్తులు గద్దెల వద్ద వేచి చూడటంతో దర్శనానికి వచ్చే ఇతర భక్తులకు ఆలస్యమవుతోంది.
దీనిని దృష్టిలో పెట్టుకుని 2022 ఫిబ్రవరిలో జరిగే జాతరలో మొక్కులు చెల్లించిన భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేసే ఆలోచన ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. కోటి మందికి అందేలా బెల్లం, పసుపు, కుంకుమలను ప్రత్యేకంగా ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.