ముంచుకొస్తున్న ముర‌సు తుఫాన్

మరో తుఫాను గండం ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. మరికొన్ని గంటలలో తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం, ఈరోజు ఉదయం సమయానికి తుఫానుగా బలపడింది.ఈ తుఫాన్‌కు మురసు (Murasu)గా నామకరణం చేశారు అధికారులు. గంటకు 20 కి.మీ వేగంతో కదులుతున్న ఈ తుఫాన్‌ సోమవారం నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మంగళవారం నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 100-120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో తీరం ప్రాంతాల్లోని జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.

ఈ తుఫాన్ ప్రభావంతో ఇటు తెలంగాణలోను వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 2, 3 తేదీల్లో రాష్ట్రంలోని ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌తో పాటు వనపర్తి జిల్లాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

గత తుఫాన్‌కు అర్నబ్ అని పేరు పెట్టారు. దాని పేరును బంగ్లాదేశ్ పెట్టింది. ఈసారి వ‌చ్చే తుఫానుకు ముర‌సు అని నామ‌క‌ర‌ణం చేశారు. దీనికి భార‌త్ పేరు పెట్టింది. ‘మురసు’ అంటే యుద్ధ భేరి అని అర్థం.

You might also like