ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవాలి
సింగరేణికి మరో వందేళ్ల పాటు ఉజ్వల భవిత - వ్యాపార విస్తరణ చర్యలతో కంపెనీ అభివృద్ధికి పటిష్ట పునాది - వచ్చే ఏడాది నుంచి నైనీ నుంచి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి - 2025 నాటికి 100 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం - సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఅండ్‌ఎండీ ఎన్.శ్రీధర్
మున్ముందు ప్రైవేట్ రంగం నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు, అధికారులు సమష్టిగా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సీఅండ్ ఎండీ ఎన్.శ్రీధర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ఇంధన అవసరాల కోసం బొగ్గు రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారన్నారు. అందుకే ఇప్పటి నుంచి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలే బొగ్గు తీసే పరిస్థితి ఉండబోదన్నారు. అంకితభావం, క్రమశిక్షణ కలిగిన సింగరేణీయులు తమ శ్రమ శక్తితో ఇలాగే కష్టపడి పనిచేస్తే కంపెనీకి మరో వందేళ్ల పాటు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు.
దేశంలో వందేళ్ల లో ఎన్నో ప్రభుత్వ రంగ కంపెనీలు ఆవిర్భవించాయని, నష్టాలతో మూతపడ్డాయన్నారు. కానీ సింగరేణి మాత్రం 13 దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థల కన్నా మిన్నగా పనితీరును కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. ఏడాదిన్నర కాలంలో కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 68 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని, 400 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాల సాధన దిశగా ముందుకెళ్తున్నామన్నారు. కంపెనీ ప్రతిష్టాత్మకంగా ఒడిశా రాష్ట్రం నైనీ లో చేపడుతున్న నైనీ బొగ్గు బ్లాక్ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని రానుందని చెప్పారు.
వ్యాపార విస్తరణ చర్యలతో సత్ఫలితాలు..
సింగరేణి కంపెనీ ఉజ్వల భవిష్యత్ కోసం చేపట్టిన వ్యాపార విస్తరణ చర్యలతో సంస్థ అభివృద్ధికి పటిష్ట పునాది పడిందని ఆయన చెప్పారు. కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం మంచి పనితీరుతో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అలాగే 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లలో ఇప్పటికే 219 మెగావాట్ల నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతోందని తెలిపారు. కరీంనగర్ లో లోయర్ మానేరు డ్యాంలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టబోతున్నామని పేర్కొన్నారు. అంకితభావం కలిగిన ఉద్యోగుల వల్లే సంస్థ నిర్దేశించుకున్న ప్రతి లక్ష్యాన్ని చేరుకోగలుగుతుందని, మున్ముందూ ఇదే అంకితభావాన్ని ప్రదర్శించాలని కోరారు.
సింగరేణి లోని పని సంస్కృతి భేష్..
తాను కలెక్టర్ గా వివిధ జిల్లాల్లో పనిచేశానని, ముఖ్యమంత్రి కార్యదర్శిగా విధులు నిర్వర్తించానని, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును చాలా దగ్గరగా పరిశీలించానన్నారు. అయితే సింగరేణి లో ఉద్యోగులు, అధికారులు చూపించే క్రమశిక్షణ అత్యద్భుతమని సీఅండ్ఎండీ శ్రీధర్ ప్రశంసించారు. సవాళ్లను ఎదుర్కోవడం, నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారన్నారు. ఏడేళ్లుగా ఇక్కడ చూస్తున్న పనిసంస్కృతిని తాను ఇతర కంపెనీల్లో ఎక్కడా చూడలేదన్నారు. ఈ కష్టించే తత్వం వల్లే కంపెనీ లాభాల బాటలో నిలుస్తోందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు పనిచేసి కంపెనీని అగ్రస్థానంలో నిలపాలన్నారు.
ఉత్తమ ఉద్యోగులకు సన్మానం..
సింగరేణి డే సందర్భంగా సింగరేణి భవన్ లో అంకితభావంతో పనిచేస్తున్న ఎన్సీడబ్ల్యుఏ ఉద్యోగిని, అధికారిని ఈ సందర్భంగా సీఅండ్‌ఎండీ సన్మానించారు. ఎన్‌సీడబ్ల్యు ఏ ఉద్యోగుల విభాగం అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ రెడ్డిని, అధికారుల నుంచి ఛైర్మన్ ఆఫీస్ లో పనిచేస్తున్న డీజీఎం(ఈ అండ్ ఎం) జి.వి.ఎన్.గురుప్రసాద్ ను సన్మానించారు. కార్యక్రమంలో అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.ఆల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) సూర్యనారాయణ, జీఎం(మార్కెటింగ్) రవి ప్రసాద్, జీఎం(స్ట్రాటెజిక్ ప్లానింగ్) సురేందర్, సీఎంవోఏఐ జనరల్ సెక్రెటరీ ఎన్.వి.రాజశేఖర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సింగరేణి డే సందర్భంగా కంపెనీ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అడ్మినిస్ట్రేటివ్ విభాగం ఆధ్వర్యంలో పలు విభాగాల్లోని పోటీల విజేతలకు జనరల్ మేనేజర్ (కో`ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ బహుమతులు ప్రదానం చేశారు.
ఆకట్టుకున్న ‘‘ఆ పాత మధురాలు’’…
సింగరేణి డే సందర్భంగా సింగరేణి భవన్ లో జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) శ్రీ కె.సూర్యనారాయణ ఆదేశాల మేరకు సీనియర్ కమ్యూనికేషన్ అధికారి గణాశంకర్ పూజారి నేతృత్వంలో ఆ పాత మధురాలు పేరిట నిర్వహించిన సంగీత విభావరి అందరినీ అలరించింది. పలువురు ప్రఖ్యాత గాయనీ, గాయకులు, సింగరేణి ఉద్యోగులు పాల్గొన్న ఈ సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ లైజన్ ఆఫీసర్, పి.ఆర్.ఓ. మహేష్ వాఖ్యతగా వ్యవహరించారు.