జెన్‌కోకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు

రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, తెలంగాణ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి రోజుకు కనీసం 16 వేల టన్నుల బొగ్గు రవాణా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ నుంచి సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధప్రకాష్‌ జ్యోతి, తెలంగాణ జెన్‌కో సీఎండీ డాక్టర్‌ హరీష్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జెన్ కోకు జరుగుతున్న సరఫరా మరింత పెంచాలని నిర్ణయించారు. జెన్‌కో థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు రవాణాలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాల విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా చేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సంస్థ డైరెక్టర్లు, ఏరియా జనరల్‌ మేనేజర్లకు సూచించారు.

మూడు నాలుగేళ్లతో పోల్చి చూసినా సరే ఈ ఏడాది తెలంగాణ జెన్‌కోకు ఎక్కువ బొగ్గు సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు పెరిగితే సింగరేణి తన సామర్థ్యం మేరకు మరింత బొగ్గు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. నైనీ గనిలో ప్రస్తుతం రోజుకు సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే ప్రస్తుతం 3 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉందని సీఎండీ తెలిపారు. ఒడిశాలో స్థానికంగా రవాణా సమస్యల వల్ల బొగ్గు రవాణాలో కొంత జాప్యం జరుగుతోందని, ఈ నెలాకరు నుంచి 16 వేల టన్నులను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జెన్ కో సీఎండీ డాక్టర్ హరీష్ వివరించారు. గని నుంచి సమీప రైల్వే సైడింగ్‌ వరకు రోడ్డు మార్గంలో జరుగుతున్న బొగ్గు రవాణాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. గత సమావేశాల తర్వాత బొగ్గు రవాణా పెరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు జెన్ కో లతో సహా స్థానికంగా ఉండే పలు ప్రైవేట్ సంస్థలు కూడా నైనీ బొగ్గు కోసం విజ్ఞ‌ప్తి చేస్తున్న విషయాన్ని నైనీ జీఎం ప్రస్తావించారు. నైనీ లో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో మొదటి ప్రాధాన్యంగా తెలంగాణ జెన్ కోకు సరఫరా చేయాలని, మిగిలిన బొగ్గును కూడా ఇతర సంస్థల అవసరాల కోసం రవాణా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజు నైనీ బొగ్గు రవాణా విషయంలో తెలంగాణ జెన్ కో అధికారులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్‌.వి. సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతమ్‌ పోట్రు, తిరుమలరావు, ఈడీ (కోల్‌ మూవ్‌మెంట్‌) బి. వెంకన్న, జనరల్‌ మేనేజర్‌ (కోఆర్డినేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌) టి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు. తెలంగాణ జెన్‌కో డైరెక్టర్‌ (కోల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌) నాగ్యతో పాటు రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల చీఫ్‌ ఇంజినీర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు.

You might also like