55 నిమిషాలు… 4.60 లక్షల టిక్కెట్లు..
శ్రీవారి దర్శన టికెట్లకు భారీ డిమాండ్ - 55 నిమిషాల్లోనే మొత్తం ఖాళీ - రేపు సర్వదర్శనం కోటా

నాలుగు లక్షల 60 వేల టిక్కెట్లు… భక్తులు కేవలం 55 నిమిషాల్లో మొత్తం బుక్ చేసుకున్నారు. తిరుమల శ్రీవారి టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. భక్తుల నుంచి ఏకంగా 14 లక్షల హిట్లు రావడంతో టిక్కెట్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైంది. టిక్కెట్లు దొరక్క కొంతమంది భక్తులు నిరాశ వ్యక్తం చేశారు. జనవరికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. టిక్కెట్లు విడుదల చేసిన 55 నిమిషాల్లోనే 4లక్షల 60 వేల టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు.
శనివారం జనవరి నెలకు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు 5 వేలు ఆఫ్‌లైన్‌లో.. మరో 5 వేలు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈనెల 25 ఉదయం 9 గంటల నుంచి ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. రోజుకి 5 వేల చొప్పున లక్షా 55 వేల టికెట్లను విడుదల చేయనున్నారు. ఈ నెల 31 నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు జారీ చేస్తారు. ఆఫ్‌లైన్‌లో ప్రతినిత్యం తిరుపతిలో ఐదు వేల టికెట్లు అందుబాటులో ఉంచుతారు.
శుక్రవారం ఉదయం జనవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలయ్యాయి. జనవరి 1, 13 నుంచి 22 వరకు రోజుకు 20వేల చొప్పున విడుదలయ్యాయి. మిగతా రోజుల్లో రోజుకు 12వేల చొప్పున మాత్రమే ఇచ్చారు గురువారం స్వామివారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జనవరి నెలకు సంబంధించి 1, 2, 13నుంచి 22 వరకు, 26న 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లను విడుదలయ్యాయి.
మరోవైపు తిరుమలలో వసతికి సంబంధించి ఈ నెల 27న ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. కాగా జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో భక్తులు పొందవచ్చు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్శన, వసతిని బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలి.